హుజూరాబాద్ ఉప ఎన్నిక కాక రేపుతోంది. కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరిక నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికను ఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కానీ రాజకీయ పార్టీలు మాత్రం అక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యారు. ఇక కావాల్సింది కాంగ్రెస్ పార్టీ నుంచే. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ పేరు బలంగా వినిపిస్తోంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆమె అభ్యర్థిత్వానికే మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో పోటీపై కొండా సురేఖ మనసులో మాటను బయట పెట్టారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీకి దీటైన పోటీ ఇచ్చేందుకు తనను పోటీ చేయాలని పార్టీ నేతలు కోరుతున్నారని సురేఖ తెలిపారు.
కానీ అక్కడ పోటీ చేయాలంటే తాను ఒక షరతు పెట్టినట్టు ఆమె వెల్లడించారు. ఒకవేళ హుజురాబాద్‌లో పోటీ చేసినా మళ్లీ వరంగల్‌కే వస్తానని, అలాంటి హామీ వస్తేనే హుజురాబాద్‌లో పోటీ చేస్తానని అధిష్టానానికి తేల్చి చెప్పినట్టు కొండా సురేఖ తెలిపారు.
ముఖ్యంగా సామాజిక వర్గాల వారీగా హుజూరాబాద్‌లో ఓటర్లను చూస్తే…కొండా సురేఖకు సంబంధించి పద్మశాలీలు, అలాగే ఆమె భర్త కొండా మురళి సామాజిక వర్గం మున్నూరు కాపులు గెలుపోటములపై ప్రభావం చేసే స్థాయిలో ఉన్నారు. అందుకే కొండా సురేఖ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ ఆసక్తి చూపడం.