అవినీతికి ఆస్కారం లేకుండా పాలన సాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కల కనడమే తప్ప…నెరవేరడం లేదు. పేరుకే జగన్‌ది అధికారం, పెత్తనం మాత్రం మైనింగ్ మాఫియాదే అనే విమర్శ బలంగా ఉంది. మైనింగ్ శాఖలో ఓ ఉన్నతాధికారి బదిలీ జగన్ ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోనుంది.
జగన్ ప్రభుత్వంపై మైనింగ్ మాఫియా ఎంతగా ప్రభావం చూపుతున్నదో ఆ ఉన్నతాధికారి బదిలీ నిదర్శనంగా నిలవనుంది. మైనింగ్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.ప్రతాప్‌రెడ్డిని విశాఖ, శ్రీకాకుళం జిల్లాల విధుల నుంచి తప్పించడంతో పాటు నామమాత్రంగా గనులున్న విజయనగరం జిల్లాకు పంపడం విమర్శలకు తావిస్తోంది.
వృత్తిపై ప్రతాప్‌రెడ్డి నిబద్ధత ఏపాటిదో ఈ వాక్యాలు చదివితే తెలుస్తుంది.
‘2015 ఆగస్టులో భూగర్భ గనుల శాఖ విజిలెన్స్ ఏడీగా ప్రతాప్‌రెడ్డి ఉండేవారు. తాడిపత్రిలో కొనసాగుతున్న అక్రమాలను చూసి ఆయన నివ్వెరపోయారు. బిల్లులు సక్రమంగా లేని లారీలకు భారీగా జరిమానాలు విధించారు. దీంతో అప్పట్లో జేసీ సోదరుల ప్రధాన అనుచరుడు పొట్టి రవి ఆయన్ను బెదిరించారు. అయినప్పటికీ విజిలెన్స్ ఏడీ భయపడకుండా దాడులు మరింత ముమ్మరం చేశారు. ఇలా రెండేళ్లలో గ్రానైట్ అక్రమ దందాపై ఉక్కుపాదం మోపారు.
2015కు ముందు జరిమానా రూపంలో ఏటా రూ. కోటి వసూలయ్యేది. ప్రతాప్‌రెడ్డి వచ్చాక 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారు. దీంతో లగాన్ గ్యాంగ్ ప్రతాప్‌రెడ్డిని దారికి తెచ్చుకోవాలని చూసింది… ఆ తర్వాత బెదిరించింది. భౌతిక దాడులకు యత్నించింది. అయినా ఫలితం లేకపోకపోవడంతో తమ ‘పచ్చ’ నేతలకు చెప్పి అవినీతి మరక అంటిం చేందుకు ప్రతాప్‌రెడ్డిపై డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయించింది. అయితే ఉన్నతాధికారులు ఏడీ ప్రతాప్‌రెడ్డికి క్లీన్‌చిట్ ఇచ్చారు’
ఇవి ఎల్లో మీడియా రాతలు ఎంత మాత్రం కావు. రెండు రోజుల క్రితం జగన్ సొంత పత్రిక సాక్షి అనంతపురం టాబ్లాయిడ్‌లో లగాన్ దందాపై రాసిన కథనంలో రాసిన అణిముత్యాలు. టీడీపీ హయాంలో అక్రమార్కుల ఆగడాలను ప్రతాప్‌రెడ్డి ఆట కట్టించి ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూర్చారని రాశారు.
చంద్రబాబు పాలనలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపిన ప్రతాప్‌రెడ్డిని ప్రోత్సహించారని స్వయంగా జగన్ పత్రిక లోకానికి చాటి చెప్పింది. మరి జగన్ ప్రభుత్వం అలాంటి నిజాయితీ అధికారిని బదిలీ వేటుతో సత్కరించింది. తాను మైనింగ్ మాఫియాకు అండగా నిలుస్తానని నిజాయితీపరులైన అధికారులకు ఓ హెచ్చరికను పంపినట్టైంది.
16 నెలల క్రితం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల విజిలెన్స్ బాధ్యతల్ని ప్రతాప్‌రెడ్డి చేపట్టారు. మైనింగ్ మాఫియాకు నిద్ర లేకుండా చేశారు. ప్రాణాలకు తెగించి నవయుగ, మధుకాన్, నవోదయ గ్రానైట్స్ తదితర పేరున్న మైనింగ్ సంస్థలపై దాడులు నిర్వహించి భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చారు. దీంతో మైనింగ్ మాఫియా కంట్లో నలుసయ్యారాయన.
ఈ నేపథ్యంలో ప్రతాప్‌రెడ్డిని ప్రాధాన్యం లేని విజయనగరం జిల్లాకే పరిమితం చేయడం దేనికి సంకేతం? ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే అధికారులను ప్రోత్సహించడం మానేసి, వ్యక్తిగత సంపదను పోగేసుకునే మాఫియాకు అండగా నిలవడం ఏంటని జగన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.