ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితిని కొన్ని రాజకీయ పక్షాలు కావాలనే ఎంత వివాదాస్పదం చేశాయో, చేస్తున్నాయో చూస్తున్నాం. పక్కా రాజకీయ స్వార్థంతో జగన్ ప్రభుత్వానికి లేని ఉద్దేశాలు అంటగడుతూ రెండుమూడు రోజులుగా రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకున్నాయి. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించే వినాయక చవితి సంబరాల నిర్వహణపై ఆంక్షలు విధించామని జగన్ ప్రభుత్వం ఎంత చెప్పినా ….ప్రతిపక్షాలు చెవికెక్కించుకోలేదు.
జగన్ క్రిస్టియానిటీని తెరపైకి తెచ్చి, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శించారు. ఈ విమర్శలకు బీజేపీ శ్రీకారం చుడితే, టీడీపీ, జనసేన కూడా అందుకున్నాయి. వినాయక చవితి సంబరాలపై చివరికి కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ప్రతిపక్షాల చెంప ఛెళ్లుమనిపించేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బహిరంగ ప్రదేశాల్లో వినాయకుడి విగ్రహాలు, మండపాల ఏర్పాటుకు అనుమతించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలు సమర్థనీయమేనని, ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.
బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలు పెట్టుకోవడానికి నిరాకరిస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ న్యాయవాది, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి సిద్ధినేని శ్రీసత్యసాయిబాబు వేసిన పిల్‌ను హైకోర్టు కొట్టి వేసింది.
ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు ధర్మాసనానికి కూడా మతం కోణంలో ఉద్దేశాలు అంటగట్టి విమర్శించే దమ్ము, ధైర్యం ఈ ప్రతిపక్షాలకు ఉందా? హిందువుల మనోభావాలను హైకోర్టు దెబ్బతీసిందని, తెలంగాణలో లేదా మరోచోట లేని ఆంక్షలు ఇక్కడే ఎందుకని హైకోర్టును ప్రశ్నించడం చేతనవుతుందా? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు హైకోర్టు తీర్పుతోనైనా ఫుల్‌స్టాప్ పడుతుందని ఆశిద్దాం.