ఇండియా-ఇంగ్లండ్ ల మధ్యన మాంచెస్టర్ లో నేటి నుంచి జరగాల్సిన ఐదో టెస్ట్ యథాతథంగా జరగనుంది. మ్యాచ్ కు ముందు భారత బృందంలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. నాలుగో టెస్టు జరుతుండగానే భారత కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. అలాగే అసిస్టెంట్ ఫిజియో ఒకరికి కూడా కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది.
ఈ నేపథ్యంలో ఆటగాళ్లు కూడా ఎవరైనా కరోనాకు గురయ్యారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. అంతా కోవిడ్ నెగిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో ఐదో టెస్టు యథాతథంగా జరగనుంది.
భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ లో అడుగుపెట్టినప్పటి నుంచి కరోనా అంశం ఆందోళన రేపుతూనే ఉంది. వరల్ట్ టెస్ట్ చాంఫియన్షిప్ ఫైనల్ తర్వాత భారత క్రికెటర్లు బయట తిరగడంతో కరోనా టెస్టులు తప్పనిసరి అయ్యాయి. ఆ సమయంలో కీపర్ రిషబ్ పంత్ కరోనాకు గురయ్యాడు. తర్వాత కోలుకుని టెస్టు సీరిస్ కు అందుబాటులోకి వచ్చాడు.
మ్యాచ్ ల సందర్భంగా వీక్షకులను స్టేడియంలలోకి అనుమతిని ఇచ్చింది ఇంగ్లండ్ బోర్డు. ప్రేక్షకులు ఎవ్వరూ కూడా మాస్కులూ గట్రా పెట్టుకోవడం లేదు. స్టేడియంలు ఫుల్ కెపాసిటీతో మ్యాచ్ లు జరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగా జరిగిన దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది ఇంగ్లాండ్. ఈ నేపథ్యంలో ప్రజలకు పెద్దగా ఆంక్షలు లేవు. అయితే కరోనా ఫ్రీ కాలేదని మాత్రం ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇటీవలే రవిశాస్త్రి తన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాడు. ఆ సందర్భంగా నే కరోనా కు గురయ్యారా? అనే అనుమానాలున్నాయి. ఆ కార్యక్రమానికి కొహ్లీ కూడా హాజరయ్యాడు. ఈ విషయంపై బీసీసీఐ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. రవిశాస్త్రి కరోనా పాజిటివ్ గా తేలడంతో పెద్ద దుమారమే మొదలయ్యేలా అనిపించింది. అయితే ఆటగాళ్లంతా కరోనా నెగిటివ్ గా తేలడంతో అంతా సవ్యంగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది.