లెక్కప్రకారం వచ్చే నెల విడుదల కావాలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా. ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందంటూ గతంలోనే ఊహాగానాలు వినిపించాయి. అదే టైమ్ లో విశ్వక్ సేన్ బరస్ట్ అయ్యాడు కూడా. డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేయకపోతే ప్రచారానికి రానంటూ నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చాడు.
ఇప్పుడీ సినిమా నిజంగానే పోస్ట్ పోన్ అయింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వాయిదా పడినట్టు ప్రకటించిన నిర్మాతలు, కొత్త విడుదల తేదీ ప్రకటించారు. డిసెంబర్ నుంచి ఏకంగా వచ్చే ఏడాది సమ్మర్ కు వాయిదా పడింది ఈ సినిమా. కొత్త విడుదల తేదీ మార్చి 8.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా తెరకెక్కుతోంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా. ఈ సినిమా వాయిదా పడుతుందనే విషయాన్ని పరోక్షంగా ఇప్పటికే పలుమార్లు వెల్లడించాడు నిర్మాత. మరిన్ని పుకార్లు వ్యాపించకుండా, ఈరోజు కొత్త విడుదల తేదీ ప్రకటించాడు.
నాగవంశీ అయితే మంచి డేట్ సెట్ చేసుకున్నాడు. కానీ అప్పటికే ఆ తేదీకి ఓ సినిమా సిద్ధంగా ఉంది. అదే డబుల్ ఇస్మార్ట్. మహాశివరాత్రి కానుకగా డబుల్ ఇస్మార్ట్ సినిమాను మార్చి 8న విడుదల చేస్తామంటూ ముహూర్తం షాట్ రోజునే ప్రకటించాడు దర్శకనిర్మాత పూరి జగన్నాధ్. అతడి సినిమాలు ఎంత ఫాస్ట్ గా రెడీ అవుతాయో అందరికీ తెలిసిందే.
కాబట్టి డబుల్ ఇస్మార్ట్ సినిమా రావడం పక్కా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దాదాపు రెడీగా ఉంది కాబట్టి ఈసారి ఇది కూడా వాయిదా పడే ప్రసక్తి లేదు. సో.. శివరాత్రికి ఇప్పట్నుంచే మెల్లగా పోటీ మొదలైందన్నమాట.