దాదాపు వారం పది రోజులుగా సినిమా వార్తల్లో తెగ హల్ చల్ చేస్తున్న సినిమా జార్జి రెడ్డి. సినిమా సెలబ్రిటీలు పదే పదే జార్జిరెడ్డి పేరు ట్వీట్ చేస్తున్నారు. చూడమని రికమెండ్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో జార్జిరెడ్డి నిర్మాతలు మీడియా ముందుకు వచ్చారు. జార్జి రెడ్డి నిర్మాతలు అప్పిరెడ్డి, దామోదర రెడ్డి ,సంజయ్ రెడ్డి సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు అందించారు.
అప్పిరెడ్డి మాట్లాడుతూ: ‘మైక్ టివి ద్వారా ఎంటర్ టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టాం.. ఒకసారి దామోదర్ రెడ్డి, జీవన్ రెడ్డి లు జార్జిరెడ్డి కథ గురించి చెప్పారు. చాలా ఎగ్జైట్ అయ్యాను. రెగ్యులర్ కమర్షియల్ సినిమా లు కాకుండా జార్జిరెడ్డి కథ లో ప్రత్యేకత నన్ను ఆకర్షించింది.
అందుకే మార్కెట్ లెక్కలు పట్టించుకోకుండా ఖర్చు పెట్టాం. ఉస్మానియా సెట్ ను నిర్మించాం.. ఇప్పుడు మా అంచనాలను మించి జార్జిరెడ్డి వస్తున్న స్పందన మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ కథ తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది' అన్నారు.
దామోదర్ రెడ్డి మాట్లాడుతూ: ‘ దళం తర్వాత జీవన్ ఉస్మానియాలో అయిదు నెలలు ఈ కథ రీసెర్చ్ కోసం గడిపాడు. జార్జిరెడ్డి ప్రెండ్స్ అందరినీ కలిసాడు. ఒక మేథావి, ఫైటర్, అన్యాయాలను ఎదుర్కోవడంలో ముందుండే లక్షణం ఇవన్నీ కూడా ఒక హీరో ఇమేజ్ కుండే లక్షణాలే. అందుకే జార్జిరెడ్డి కథకు హీరోలు అవసరం లేదు, ఆ కథలోనే హీరోయిజం ఉంది అనిపించింది.
అందుకే ఇమేజ్ ఉన్న హీరోల కోసం ప్రయత్నించలేదు. ఏదైనా ఉద్యమం లో గానీ, ఆర్గనేజేషన్ లోగానీ మంచి చెడులు ఉంటాయి. వాటని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేసాం అంతే కానీ ఎవర్నీ హీరోలుగా, విలన్లుగా చూపించలేదు. జార్జిరెడ్డితో ఈ తరం తప్పకుండా కనెక్ట్ అవుతుంది. ఆ నమ్మకం మాకు ఉంది ’ అన్నారు.
సంజయ్ రెడ్డి మాట్లాడతూ ‘ఈ సినిమా గురించి అప్పిరెడ్డి ని కలసి నప్పుడు తెలిసింది. ఈ సినిమా లోని కొన్ని సన్నివేశాలు చూసాను. జీవన్, దామోదర్, సుధాకర్ ల మాటలలో సినిమా పై ఒక ప్యాషన్ కనపడింది అందుకే నిర్మాణ భాగస్వామిగా జాయిన్ అయ్యాను.
ట్రైలర్ తో జార్జిరెడ్డి ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసాడు.పరిశ్రమ మొత్తం జార్జిరెడ్డిని స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.