తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి రానుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే, సమ్మె విరమిస్తామనీ తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది. దాంతో 47 రోజుల సమ్మెకు తెరపడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
ఇదిలా వుంటే, ఆర్టీసీ కార్మిక సంఘాల విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలనీ, మానవీయ కోణంలో ఆలోచించి కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ బహిరంగ లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విషయంలో 'జగన్ రెడ్డిగారూ..' అంటూ వెటకారం చేస్తోన్న జనసేనాని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని మాత్రం 'పెద్దలు, గౌరవనీయులు కె చంద్రశేఖర్‌రావుగారు..' అంటూ బహిరంగ లేఖలోనూ, ట్వీట్‌లోనూ పేర్కొనడం గమనార్హం.
ఎలాగూ కార్మిక సంఘాలు దిగొచ్చాయి గనుక, తెలంగాణ ప్రభుత్వం కొంతమేర సానుకూలంగా స్పందించి కార్మికుల్ని విధుల్లోకి తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తే, ఆ క్రెడిట్‌ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఖాతాలో వేసుకోకుండా వుంటారా.?
ఆంధ్రప్రదేశ్‌లో వరదల కారణంగా ఇసుక కొరత ఏర్పడితే పవన్ కళ్యాణ్ అండ్ టీమ్ నానా యాగీ చేసిన విషయం విదితమే. వరదలు తగ్గిన వెంటనే ఇసుక వారోత్సవాలు చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. అన్న మాట ప్రకారం.. ఇసుక వారోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఆ ఇసుక వారోత్సవాల క్రెడిట్‌ని జనసేన పార్టీ తన ఖాతాలో వేసుకున్న విషయం విదితమే.
మొత్తమ్మీద, పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాల్లో మంచి టైమింగ్ పాటిస్తున్నారుగానీ.. ఆయనగారి 'క్రెడిట్ పాట్లు' మాత్రం బెడిసి కొట్టేస్తున్నాయి.