బంగార్రాజు తరువాత మళ్లీ సీనియర్ హీరో నాగార్జున బయటకు వచ్చారు. తన లేటెస్ట్ సినిమా ‘ఘోస్ట్’ టీజర్ ను విడుదల చేసారు. ఆసియన్ సునీల్, రామ్మోహనరావు, శరత్ మరార్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఫుల్ క్లాస్ యాక్షన్ జానర్ లో తయారవుతున్నట్లు టీజర్ స్పష్టం చేసింది.
రెండు బలమైన కత్తులు పట్టుకుని హీరో నాగార్జున శతృవులను హతమార్చే సీన్ ను టీజర్ గా కట్ చేసారు. దీనికి వాడిన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ పెర్ ఫెక్ట్ గా వుంది. సినిమాను అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు టీజర్ ద్వారా ప్రకటించారు.
సినిమా కేవలం యాక్షన్ బేస్డ్ కాదని, ఇందులో సిస్టర్ సెంటిమెంట్, ఓ పాప సెంటిమెంట్ కూడా వుంటాయని, బలమైన ఎమోషన్లు వుంటాయని హీరో నాగార్జున వెల్లడించారు. ప్రవీణ్ సత్తారు యాక్షన్ సీన్లు బాగా తీస్తాడని, అందుకే తనతో సినిమా చేయాలనిపించిందని ఆయన చెప్పారు.
కోవిడ్ కారణంగా సినిమా బాగా ఆలస్యం అయిందని, కోవిడ్ టైమ్ లో కూడా ధైర్యం చేసిన షూటింగ్ కొనసాగించామని మొత్తానికి మంచి అవుట్ పుట్ వచ్చిందని దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పారు. ఈ విషయంలో హీరో నాగార్జునకు థాంక్స్ చెప్పారు.
నిర్మాతలు శరత్ మరార్, ఆసియన్ సునీల్, రామ్మోహనరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.