జర్మనీ ఎంతో మేధోసంపత్తిని కలిగిన దేశం. శతాబ్దాల గమనంలో పరిశీలిస్తే.. ప్రపంచానికి ఎన్నో తయారు చేయించి ఇచ్చిన దేశం జర్మనీ. అక్కడ నుంచి ఎంతోమంది ఫిలాసఫర్లు, మరెంతో మంది మేధావులు, శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు, గొప్ప రాజకీయ సిద్ధాంతాలను చెప్పిన వారు, అధునాతన యంత్రాల రూపకర్తలు, మత ప్రవక్తలు, ఇంకా ప్రపంచాన్ని అలరించిన క్రీడాకారులు, కార్ల మేకర్లు.. ప్రపంచాన్ని పలకరించారు!.
ఏతావాతాజర్మన్ సొసైటీ ఎంతో ఇంటెలెక్చువల్! మరి అలాంటి సొసైటీనే హిట్లర్ ను నమ్మింది! ఎంతో మేధస్సును కలిగిన జాతిని హిట్లర్ తన వలలో పడేశాడు అనాలేమో! అంత మేధస్సును కలిగి కూడా హిట్లర్ వంటి విచ్ఛిన్నకారుడిని నమ్మి నిలువునా నష్టపోయిన దేశం జర్మనీ.
మరి అంత మేధోవంతులు వచ్చిన దేశం కదా.. అది నిజంగానే హిట్లర్ ను పూర్తిగా సమర్థించిందా? మనం ప్రపంచాన్ని ఏలేద్దాం, యుద్ధం చేసి ప్రపంచాన్ని అదుపులోకి తీసుకుందాం? అనగానే పొలోమంటూ జర్మన్లు హిట్లర్ కు జై కొట్టారా? ఏ మధ్యయుగం ఆలోచనలతోనో హిట్లర్ తన అధికార కాంక్షను చాటగానే.. మన జాతి గొప్పదనగానే జర్మన్లు అతడికి జై కొట్టారా? అనేవి ఆసక్తిదాయకమైన ప్రశ్నలు.
సూటిగా అర్థమయ్యే విషయం ఏమిటంటే.. హిట్లర్ కు జర్మన్లలో మెజారిటీ మద్దతు ఉంది. వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధకాలానికి కొంత మందు జరిగిన జర్మనీ ఎన్నికల్లో హిట్లర్ నెగ్గింది స్వల్ప మెజారిటీతోనే. అధికారం అందగానే హిట్లర్ పాత నియయాలను రద్దు చేసేశాడు. తన పదవీ కాలాన్ని తనే పొగిడించుకున్నాడు. ఒక్కసారి హిట్లర్ చేతికి అధికారం అందాకా.. అతడిని ఆపగలిగే వాడు జర్మనీలో లేకపోయాడు. అక్కడ వచ్చింది తేడా.
ఆ తర్వాత హిట్లర్ జర్మన్లలో జాత్యాంహాంకారాన్ని నింపాడు. ఆర్యులమని ప్రపంచాన్ని ఏలేవాళ్లమన్నాడు. యూధులను పక్కనే పొంచి ఉన్న విరోధులుగా చూపించాడు. యూధులు దోచుకుంటున్నారని, యూధులు అవినీతి పరులు అని, జర్మన్ల అవకాశాలను ఎక్కడ నుంచినో వచ్చిన యూధులు తన్నుకుపోతున్నారని, వారికి అస్సలు బతికే అర్హత కూడా లేదని, బతికితే తమకు బానిసలుగా బతకాలి తప్ప మరోలా కాదన్న రీతిలో జర్మన్లలో జాతివిద్వేషాన్ని నింపాడు హిట్లర్.
తన జాత్యాహంకార ప్రసంగాలతో జర్మన్లను ఉర్రూతలూగించాడు. దీంతో మెజారిటీ జర్మన్లు పూర్తిగా హిట్లర్ ట్రాప్ లో పడ్డారు. తన సైన్యానికి హిట్లర్ ఒక దేవుడయ్యాడు. హిట్లర్ దైవాంశసంభూతుడు అనే భ్రమకి లోనయ్యింది జర్మనీ. అప్పటి వరకూ వారు వారు సంపాదించిన మేధస్సు ఆ ఐదారేళ్లలో అతఃపాథాలానికి చేరింది.
మరి అదే జర్మనీలో హిట్లర్ పొడగిట్టని వాళ్లు కూడా ఉన్నారు అని చాటే ఉదంతాలు కొన్ని ఉన్నాయి. హిట్లర్ కు పగ్గాలు వేయాలని, అతడి చెబుతున్నది విశృంఖల వాదమని, యూధులపై హిట్లర్ సాగిస్తున్న హింసాకాండ ను సమర్థించవద్దని కొంతమంది జర్మన్లు భావించారు. అయితే అలాంటి వాళ్లను హిట్లర్ విజయవంతంగా అణగదొక్కగలిగాడు.
ప్రజల్లోనే హిట్లర్ వాదాన్ని సమర్థించే వాళ్లు ఉండటంతో.. రాజకీయంగా హిట్లర్ వ్యతిరేకులు చేయగలిగింది ఏమీ లేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా హిట్లర్ ను ఢీకొట్టిన వాళ్లున్నారు. హిట్లర్ నే చంపేస్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించదనే భావనతో.. నాజీ ఆర్మీలోనే ఒక రహస్య ఆపరేషన్ సాగింది. అదే ఆపరేషన్ వాల్క్యూరీ.
హిట్లర్ ను సంహరించి ప్రపంచాన్ని రెండో ప్రపంచ యుద్ధం నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో జరిగిన ప్రయత్నం. నాజీ సైన్యంలో పని చేస్తూనే, హిట్లర్ కు విధేయులుగానే నటిస్తూ, హిట్లర్ ను చంపి.. రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపాలనే ఉద్దేశంతో జరిగిన ప్రయత్నమే ఆపరేషన్ వాల్క్యూరీ. జర్మన్ భాషలో వాల్క్యూరీ అని పలికే తీరు మరోలా ఉంటుంది.
ఈ ఆపరేషన్ వాల్క్యూరీ మీద ఒక అద్భుత సినిమా వచ్చింది. అదే 'వాల్క్యూరీ' ఇంగ్లిష్ స్పెల్లింగ్ (Valkyrie). వాల్కురీ అని కూడా పలుకుతుంటారు. జర్మన్ పదం కావడంతో బయట పలు రకాలుగా పలుకుతుంటారు. టామ్ క్రూస్ ప్రధాన పాత్రలో, బ్రాన్ సింగర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.
హిట్లర్ ఆరాచకాలను భరించలేక నాజీ సైన్యంలోనే వచ్చిన తిరుగుబాటే ఈ సినిమా కథాంశం. అయితే ఆ తిరుగుబాటు విఫలం అయ్యిందనే విషయం అందరికీ తెలిసినా.. అది జరిగిన తీరు, తిరుగుబాటు దార్లు అనుసరించిన వ్యూహం, హిట్లర్ ను మట్టుబెట్టడానికి వారు చేసిన ప్రయత్నం, ఒక దశలో బెర్లిన్ ను వారు హస్తగతం చేసుకోవడం, ఆ పై వారి వ్యూహాలు ఫలించక తిరుగుబాటు విఫలం కావడం, ఆ సమయంలో వారి భావోద్వేగాలు, వారి జీవితాల విషాదాంతం.. జర్మన్ చరిత్రలో వారి పేర్లు ప్రత్యేకంగా లిఖించబడటం.. ఇలా ఎన్నో ఆసక్తిదాయకమైన చరిత్రను చెబుతూ, అదే సమయంలో మంచి థ్రిల్లర్ ను వీక్షించిన అనుభూతిని ఇస్తుంది వాల్క్యూరీ.
ఇది పూర్తిగా వాస్తవ కథ. ఆపరేషన్ వాల్క్యూరీ జర్మనీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం. తమ దేశ పాలకుడే అయినప్పటికీ, తమ జాతి పేరుతో యుద్ధం చేసినప్పటికీ.. హిట్లర్ ను నవీన జర్మనీ నిరసిస్తుంది. హిట్లర్ ను దుర్మార్గుడు అంటే జర్మనీ బాధపడే పరిస్థితి లేదు.
ఎక్కడో అమెరికాలో నియో నాజీలు వచ్చారేమో కానీ.. హిట్లర్ ను తమ ప్రతినిధిగా గర్వంగా చెప్పుకోదు జర్మనీ. అందుకే.. ఈ ఆపరేషన్ వాల్క్యూరీ గురించి సినిమా తీస్తాం అనగానే.. జర్మనీ అన్ని ఏర్పాట్లూ చేసింది. తమ దేశంలోనే చిత్రీకరణకు అనుమతులు ఇచ్చింది.
తమ దేశ నటులను కూడా అందులో నటింపజేసింది. తాము హిట్లర్ ను పూర్తి స్థాయిలో సమర్థించలేదు.. అని ప్రపంచానికి చాటి చెప్పేందుకు జర్మనీ ఈ సినిమాను ఉపయోగించుకుంది. అలాగే వాల్క్యూరీ లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన నాజీ సైనికులకు స్మారక చిహ్నాలను ఎప్పుడో ఏర్పాటు చేసింది జర్మనీ. హిట్లర్ ను చంపడానికి ప్రయత్నించిన వారిని వీరులుగా పేర్కొంటూ వారిని స్మరిస్తుంది. ప్రతి యేడాదీ వారికి నివాళి ఘటిస్తుంది.
ఇంతకీ కథేమిటంటే.. జర్మనీ తరఫున ట్యూనిషియాలో పోరాడుతూ బాంబు బాంబు పేలుడులో వికలాంగుడు అవుతాడు కల్నల్ స్టఫెన్ బర్గ్ (టామ్ క్రూస్). గాయాలతో స్వదేశం చేరతాడు. కొంతకాలానికి కోలుకుని.. జర్మనీలోనే మళ్లీ విధుల్లో చేరతాడు.
దేశం కోసం వికలాంగుడు అయ్యాడు అనే కోటాలో సైన్యంలోనే వ్యూహాత్మక ఆపరేషన్లలో చోటు దక్కుతుంది అతడికి. చాలా పై స్థాయిలోనే వ్యూహకర్త అవుతాడు. హిట్లర్ తో కలిసి యుద్ధవ్యూహాలను రచించే వార్ కేబినెట్లో ఇతడు ఒక కీలకమైన వ్యక్తి అవుతాడు. అయితే యుద్ధాన్ని చాలా దగ్గర నుంచి చేసిన స్టఫెన్ బర్గ్ దీన్ని ఆపాలనే కృతనిశ్చయంతో ఉంటాడు.
హిట్లర్ కు శాంతి ప్రవచనాలు చెబితే ప్రయోజనం లేదని అతడికి తెలుసు. అంత స్థాయి కూడా అతడిది కాదు. ఈ క్రమంలో నాజీ సైన్యంలో కీలక స్థాయిల్లో ఉన్న తనబోటి ఆలోచన పరులు స్టఫెన్ బర్గ్ తో చేతులు కలుపుతారు. వీళ్లంతా క్లబ్ అయ్యి, యుద్ధాన్ని ఆపడానికి వ్యూహాన్ని ప్రిపేర్ చేస్తారు. అందుకు మొదటి మెట్టు డైరెక్టుగా హిట్లర్ ను చంపడమే అని నిర్ణయించుకుంటారు.
ఎక్కడ ఎలా చంపాలో, చంపిన తర్వాత ఎవరేం చేయాలో తమ పాత్రలు ఏమిటో చర్చించుకుని ఆపరేషన్ వాల్క్యూరీ పేపర్ వర్క్ ను పూర్తి చేస్తారు. హిట్లర్ ను చంపే బాధ్యత తీసుకుంటాడు స్టఫెన్ బర్గ్. వార్ కేబినెట్ సమావేశం జరుగుతున్న వేళ బాంబు పేల్చి హిట్లర్ ను చంపాలనేది అతడి ప్లాన్.
ఆ మేరకు బాంబును పేల్చి.. తర్వాత కార్యాచరణకు సిద్ధం అవతుంది అతడి టీమ్. హిట్లర్ అనంతరం జర్మన్ కు కొత్త ఛాన్స్ లర్ గా ఎవరుండాలో కూడా వీరే నిర్ణయించుకుంటారు. తమ సీనియర్ కు అవకాశం ఇచ్చి అతడి నాయకత్వంలో పని చేస్తామంటారు.
హిట్లర్ ను చంపగానే.. సైన్యాన్ని పూర్తిగా నియంత్రించి, బెర్లిన్ ను అదుపులోకి తీసుకుని, హిట్లర్ సమర్థకులను జైళ్లలో పడేసి, ఆ తర్వాత బ్రిటన్ తో చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపించేయాలి.. అనేది వారి ప్రథమ లక్ష్యం. ఆ మేరకు శరవేగంగానే అడుగులు వేస్తారు. అయితే బాంబు పేలుడు నుంచి హిట్లర్ తప్పించుకున్నాడనే విషయం చాలా ఆలస్యంగా వీరికి తెలుస్తుంది!
దాదాపు బెర్లిన్ వారి హస్తగతం అయ్యాకా, హిట్లర్ కేబినెట్లో నంబర్ టూ జోసెఫ్ గొబెల్స్ ను అరెస్టు చేసే తరుణంలో.. బెర్లిన్ లో నాజీ జెండాలను పీకేసే తరుణంలో తను బతికే ఉన్నట్టుగా, తిరుగుబాటు చేసిన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదని రేడియో ప్రసంగంలో ప్రకటిస్తాడు హిట్లర్. నియంత బతికే ఉన్నాడనే విషయం తెలియడంతో అంత వరకూ వీరి ఆదేశాలను తీసుకున్న సైన్యం కూడా మళ్లీ హిట్లర్ ఆదేశాలను పాటిస్తుంది.
యుద్ధాన్ని ఆపాలి, శాంతిని నెలకొల్పాలి, హిట్లర్ నియంతృత్వానికి తెరదించాలనే సదుద్దేశంతో, తమ జీవితాలనే రిస్క్ లో పెట్టి చేసిన తిరుగుబాటు విఫలం కావడంతో.. వాల్క్యూరీ లో భాగస్వామ్యులు అయిన స్టఫెన్ బర్గ్ బృందం నిస్పృహకు లోనవుతుంది. నాజీ సైన్యం వీరిని పట్టుకుని బంధిస్తుంది. ఈ తిరుగుబాటులో భాగస్వామ్యులు ఎవరనే అంశం గురించి హిట్లర్ మార్కు విచారణ జరుగుతుంది.
ఈ ఆపరేషన్ లో భాగస్తులు అయిన కొన్ని వందల మందికి మరణ శిక్షను విధిస్తాడు హిట్లర్. పై స్థాయి లో పని చేసిన వ్యక్తులను బహిరంగంగా కాల్చి చంపుతారు. అలా హిట్లర్ ఆగడాలను ఆపాలనే ప్రయత్నం విఫలం అవుతుంది. 1944లో ఈ ఆపరేషన్ వాల్క్యూరీ చోటు చేసుకుంది. హిట్లర్ ను చంపాలనే ప్రయత్నాలు చాలానే జరిగినా జర్మనీ చరిత్రలో అదొక ప్రత్యేక అధ్యాయం. అందుకు సంబంధించిన ఈ సినిమా కూడా ఆ చారిత్రాత్మక ఆపరేషన్ ను కళ్లకు కట్టి.. యోధుల త్యాగాలను అద్భుతంగా తెరపై చూపింది.
-జీవన్ రెడ్డి.బి