మొగుడు కొట్టినందుకు కాదు..తోటి కోడలు దెప్పినందుకు అన్నది సామెత. టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ పెద్దల వ్యవహార శైలి అలాగే వుంది.
గిల్డ్ లో టాలీవుడ్ సమస్యల గురించి చర్చించుకోవచ్చు. కానీ అవి బయటకు మాత్రం తెలియకూడదు. అలా తెలిస్తే గిల్డ్ పెద్దలు కొందరు సభ్యుల కేసి అనుమానంగా చూస్తారు. ‘వీళ్లే చెప్పి వుంటారు’ అని గుసగుసలు పోతుంటారు. నిజానికి గిల్డ్ పెద్దలు తెలుసుకొవాల్సింది ఒకటి వుంది.
గిల్డ్ లో రెండు డజన్లకు పైగా సభ్యులు వున్నారు. వీరందరికీ వాట్సాప్ గ్రూప్ వుంది. సభ్యులు కాని నిర్మాతలు పదుల సంఖ్యలో వున్నారు. సభ్యులైన వారు ఏం జరిగిందో? ఏం జరుగుతోందో? తమ తోటి నిర్మాతలు అడిగితే చెప్పడం కామన్. అలా అలా అది అందరికీ తెలుస్తుంది. అలాగే మీడియాకు కూడా. అంతే తప్ప ఫలానా ఫలానా నిర్మాతలు మీడియా ఏజెంట్ అనే ముద్ర వేయడం సరి కాదు.
కీలకమైన అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలే పారదర్శకంగా ప్రజలు అందరూ చూసేలా జరుగుతున్నాయి. నిర్మాతలు అందరికీ శ్రేయోదాయకంగా వుండే నిర్ణయాలు తీసుకోవడానికి సమావేశమయ్యే గిల్డ్ సభ్యులు తమ నిర్ణయాలను, చర్చలను రహస్యంగా వుంచాలని అనుకోవడం ఎందుకు?
‘గిల్డ్ సమావేశం వివరాలు నేనే మీడియాకు చెబుతున్నా అనే అనుమానం పడుతున్నారు. అందుకే నేను గిల్డ్ సమావేశాలకే వెళ్లడం తగ్గించేసాను’ అన్నారో నిర్మాత.
రెండు డజన్లకు పైగా నిర్మాతల్లో ఒక్కరో, ఇద్దరో మాత్రమే మీడియాతో మాట్లాడతారని అనుకోవడం భ్రమ. అలాగే కేవలం సభ్యుల ద్వారానే వివరాలు నేరుగా మీడియాకు వస్తాయని అనుకోవడం కూడా భ్రమే. ఒకరిలో వుంటేనే రహస్యం. ఇద్దరికి చేరితే అది రహస్యమే కాదు అన్నది పెద్దల మాట.
తోటి సభ్యులను అనుమానపు కళ్లతో చూడడం మాని, ముందు నిర్మాతలకు ఎలా మంచి చేయగలం అన్న దాని మీదే గిల్డ్ పెద్దలు దృష్టి పెట్టడం మంచిదేమో?