కొన్ని కాంబినేషన్లు అంటే క్రేజ్ మామూలుగా వుండదు. త్రివిక్రమ్-ధమన్ క్రేజ్ అలాంటిది. ఆ కాంబినేషన్ లో సాంగ్ వస్తోంది అంటే అంచనాలు మామూలుగా వుండదు. పైగా మహేష్ బాబు హీరో కదా.. మరీ ఆసక్తి. మహేష్ సినిమాలో హీరో సెంట్రిక్ సాంగ్స్ అంటే వాటి రేంజ్ వేరు. శ్రీమంతుడు, మహర్షి, కాస్త వెనక్కు వెళ్తే బిజినెస్ మన్, పోకిరి ఇలా ప్రతి సినిమాలో అవన్నీ ఓ రేంజ్ లో వుంటాయి. ఇప్పుడు గుంటూరు కారం సినిమా నుంచి హీరో సెంట్రిక్ సాంగ్ వచ్చింది. ఎలా వుంది?
రామజోగయ్య శాస్త్రి లిరిక్స్. త్రివిక్రమ్ భావాలకు అనుగుణంగా వున్నాయి. ఫ్యాన్స్ కోసం క్రేజీ పదాలు, ఇంగ్లీష్ పదాలు వాడకుండా, ఓ స్థాయి వుండాలి పాటకు, పదాలకు అని ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ‘’..ఏ లెక్కలు ఎవరికి చెప్పాలో..ఏ హక్కులు ఎవరికి రాయాలో, ఎవడెవడో వేసిన బరువు ఎందుకు ఎందుకు నే మొయ్యాలి..’’ అని రాయడం వెనుక ఏదో ధ్వనిస్తోంది.
అదేంటో సినిమా చూస్తే తెలుస్తుందేమో? లేదా అవి త్రివిక్రమ్ భావాలో? ‘’ స్వార్ధం..పరమార్ధం..కలగలిసిన నేనో ప్రేమ పదార్ధం…’ ‘నా మనసే నా కిటికీ నచ్చకపోతే మూసేస్తా..రేపటి గాయాన్ని ఇపుడే ఆపేస్తా’ ..’ నా తలరాతే రంగుల రంగోలి. దిగులైనా చేస్తా దీవాలీ..నా నవ్వుల కోటను నేనే నేనే ఎందుకు పడగొట్టాలి..’’ అన్న లైన్లు మాత్రం సినిమాలో హీరో క్యారెక్టర్ ను చెప్పినట్లు అయింది. కానీ రేపటి గాయాన్ని ఈ రోజు ఆపడం అన్న దాంట్లో వ్యాకరణ దోషం వున్నట్లో లేనట్లో రామజోగయ్య శాస్త్రినే వివరించాలి.
పాటకు ముందు చిన్న ర్యాప్ లైన్ లు, తరువాత ఇంట్రో, ఆపై చరణాలు, మధ్యలో మళ్లీ కోరస్ లైన్ లు అన్నట్లు ప్లాన్ చేసారు. దానివల్ల పాట పూర్తి సంతృప్తి ఇవ్వడం కాస్త కష్టం.అయితే ఫ్యాన్స్ కు మాత్రం లిరికల్ విడియోలోకి వచ్చిన ఒకటి రెండు స్టిల్స్, సీన్స్ ఫుల్ మీల్స్ ఇస్తాయి.
ఈ పాట మామూలుగా కన్నా సినిమాలో సీన్లతో కలిసి వస్తే బాగుండే అవకాశం ఎక్కువ వుంది.