చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంతో ఆయన తనయుడు నారా లోకేష్ కు లభించిన పెద్ద ఊరట.. ఆ పాదయాత్ర తలనొప్పిని తగ్గించినట్టుగా ఉంది! యువగళం అంటూ సుదీర్ఘ పాదయాత్రను చేసేసి తన సత్తా నిరూపించుకోవడానికి లోకేష్ మొదలుపెట్టిన ఆ యాత్ర ఎలాంటి ప్రభావాన్ని చూపకపోగా.. లోకేష్ కు ప్రశాంతత లేకుండా చేసినట్టుగా ఉంది. మొదటి రోజే ప్రశాంతత్త.. అంటూ మొదలుపెట్టిన లోకేష్ కు చివరకు ఆ ప్రశాంతత్త లేకుండా చేసింది ఆయాత్ర!
ఎన్ని రోజులు ఆయాత్ర ను సాగించిన లోకేష్ కు కనీసం వాక్ శుద్ధి కూడా లభించలేదు. ఇప్పటికీ అదే తరహాలో ప్రసంగాలు చేస్తున్నారు లోకేష్. ఇక ఆ యాత్రకు జనస్పందన కూడా అంతంత మాత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ పొలిటికల్ హిస్టరీలో ఇంత పేలవమైన పాదయాత్ర మరోటి లేదు. ఆ యాత్రను సుదీర్ఘకాలం సాగించి, అనుకున్న గమ్యాన్ని చేరినా.. దాని వల్ల దక్కే ప్రయోజనం ఎంతో టీడీపీకే అంతుబట్టలేదు. ఆఖరికి పచ్చమీడియా కూడా లోకేష్ యాత్రను లోపలి పేజీలకు పరిమితం చేసేంత పేలవ రీతిన అది సాగింది.
మొత్తానికి ఎలాగైతేనేం.. ఇప్పుడు లోకేష్ యాత్ర ఊసులో లేదు. ఇప్పటికి రెండు నెలలు గడిచిపోయినా లోకేష్ యాత్ర ప్రస్తావన లేదు. ఆ మధ్య అరెస్టుకు భయపడి చంద్రబాబు తనయుడు ఢిల్లీలో తలదాచుకున్నడానే వార్తలు వచ్చినప్పుడు కవరేజ్ కోసం.. అదిగో యువగళం, ఇదిగో యువగళం అంటూ కొంత హడావుడి చేశారు. అది రెండు మూడు రోజులే. ఇప్పుడు యాత్ర ఆగిపోయి రెండు నెలలు గడిచిపోయినా.. మళ్లీ అదెప్పుడు మొదలవుతుందో, అసలు మొదలవుతుందో కాదో కూడా క్లారిటీ లేదు!
ఎలాగోలా ఆ యాత్రను ఆపాలని మొదట్లోనే ప్రయత్నాలు జరిగాయంటారు. తన యాత్రకు ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోందంటూ లోకేషుడు హడావుడి చేశారు. మరి ఇప్పుడు ఎవరు అడ్డుకున్నారని ఆయన యాత్ర ఆగిపోయిందో మరి!