పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్ని ప్రత్యేకంగా గుర్తుచేయనక్కర్లేదు. అతడి సినిమాలు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటాయి. చిన్న అప్ డేట్ ను కూడా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేస్తుంటారు.
ఇలాంటి స్టార్ హీరో నటిస్తున్న ఓ సినిమాను మాత్రం ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు మరిచిపోతూనే ఉన్నారు. అదే హరిహర వీరమల్లు. అలా మరిచిపోయిన ప్రతిసారి ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్ డేట్ వచ్చి పోతుంటుంది. ఈసారి కూడా ఓ అప్ డేట్ వచ్చింది. కాకపోతే కాస్త గట్టి అప్ డేట్.
హరిహర వీరమల్లు సినిమా నుంచి త్వరలోనే ఓ స్పెషల్ ప్రోమో రాబోతోంది. ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రోమో చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని కూడా ఊరించింది.
చాన్నాళ్లుగా సెట్స్ పైకి రాని ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ అప్ డేట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా గ్రాఫిక్ వర్క్స్ నడుస్తున్నాయంట. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు.. ఇరాన్, కెనడా దేశాల్లో కూడా గ్రాఫిక్ వర్క్ జరుగుతోందంట.
ఈమధ్య ఈ సినిమాపై చాలా అనుమానాలు చెలరేగాయి. ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నాడని, మరో ప్రాజెక్టు పైకి వెళ్లాడనే పుకార్లు కూడా వచ్చాయి. అందులో కొంత నిజం కూడా ఉంది. అయితే హరిహర వీరమల్లు మాత్రం ఆగిపోలేదని చెప్పడం మేకర్స్ ఉద్దేశం. అందుకే ఇలా మరోసారి గుర్తుచేసే ప్రయత్నం చేశారు. ఇన్ని చెప్పిన యూనిట్, సినిమా ఎప్పుడు మళ్లీ సెట్స్ పైకి వస్తుందనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.