ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు 2009 దాకా ప్రభుత్వ అధికారి. వైఎస్సార్ పిలుపు అందుకుని ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి దాకా టీడీపీ కంచుకోటగా ఉన్న పాయకరావుపేటను బద్ధలు కొట్టారు. ఆయన పాయకరావుపేటలో మూడు సార్లు గెలిచారు. టికెట్ తీసుకున్న ప్రతీ సారి విజయబావుటా ఎగరేశారు తప్ప ఓటమి చూడలేదు.
ఆయనను వైఎస్సార్ ప్రోత్సహిస్తే జగన్ కూడా అంతే ప్రేమతో ఆదరించారు. రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్, ఒకసారి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు పెద్దల సభ అయిన రాజ్యసభకు ఆయనను పంపిస్తున్నారు. ఆరేళ్ళ పదవీకాలం కలిగిన రాజ్యసభ మెంబర్ గా గొల్లబాబూరావు ఇక మీదట కొనసాగుతారు.
వైసీపీలో గొల్ల బాబూరావుని లక్కీ లీడర్ గా అంతా అంటున్నారు. ఆయన ఎన్నికల రాజకీయాలు ఏ గొడవా లేకుండా రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారు. అది కూడా వేచి ఉండకుండా ఒక పదవి నుంచి మరో పదవికి అలా చేరుకుంటున్నారు. ఇలా ఎంతమందికి అదృష్టం దక్కుతుంది అని అంటున్నారు.
తండ్రీ కొడుకులు ఇంతలా ఆదరించినందుకు గొల్ల బాబూరావు కూడా పూర్తి స్థాయిలో ఖుషీ అవుతున్నారు. ఆయన పాయకరావుపేటను మరోసారి వైసీపీకి అందించి ఆ పార్టీ రుణం తీర్చుకుంటాను అని అంటున్నారు. ఒక్కడ ఒక చిన్న కధ కూడా చెప్పుకోవాలి. గొల్ల బాబూరావుని మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ రాజకీయాల్లోకి తీసుకుని వచ్చారు అంటారు.
అలా ఆయనకు రాజకీయ గురువు అన్న మాట. కొణతాల ఒక దశలో రాజ్యసభకు వెళ్లాలని భావించారు అని ప్రచారంలో ఉంది. ఆయన కోరిక తీరలేదు కానీ గొల్ల బాబూరావు మాత్రం అనూహ్యంగా పెద్దల సభలోకి అడుగు పెడుతున్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని నమ్ముకోవడం వల్లనే ఇదంతా అని ఆయన అనుచరులు అంటున్నారు.