సలార్ టీజర్ లో ఓ డైలాగ్ ఉంది. “లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్ చాలా డేంజరస్. కానీ జురాసిక్ పార్క్ లో కాదు. ఎందుకంటే, ఆ పార్క్ లో డైనోసార్ ఉంది.” అనే అర్థం వచ్చేలా డైలాగ్ పెట్టారు. సలార్ సినిమా పోస్ట్ పోన్ అయిన నేపథ్యంలో, ఇప్పుడీ డైలాగ్ మరోసారి వైరల్ అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ పనిగట్టుకొని మరీ ఈ డైలాగ్ ను, గ్లింప్స్ ను మరోసారి వైరల్ చేస్తున్నారు. దీనికి ఓ కారణం ఉంది.
ఊహించని విధంగా సెప్టెంబర్ 28 తేదీ నుంచి సలార్ సినిమా తప్పుకుంది. ఎప్పుడైతే ఈ సినిమా తప్పుకుందో, ఆ తేదీ కోసం మిగతా సినిమాలు పోటీ పడ్డాయి. ఎలాగైనా ఆ తేదీకి రావాలని ఆరాటపడ్డాయి. దీంతో సలార్ విడిచిపెట్టిన తేదీకి చాలా పోటీ నెలకొంది.
ఇప్పుడీ సందర్భాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. డైనోసార్ తప్పుకుంది కాబట్టి, మిగతావన్నీ అడవిలో ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నాయంటూ పోస్టులు పెడుతున్నారు. ఒక విధంగా ఇది నిజం కూడా.
28వ తేదీ కోసం పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ఎప్పుడైతే సలార్ సినిమా పోస్ట్ పోన్ అయిందో.. ఆ వెంటనే రామ్ తన స్కంద మూవీని ఆ తేదీ కోసం రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. డేటెడ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు.
రామ్ పోతినేని బరిలోకి దిగడంతో ఇక చాలా సినిమాలు తప్పుకుంటాయని అంతా భావించారు. కానీ పోటీ అనూహ్యంగా పెరిగింది. అదే తేదీకి కిరణ్ అబ్బవరం తన రూల్స్ రంజన్ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ది వ్యాక్సిన్ వార్ అనే సినిమా అల్రెడీ ఆ తేదీని ఎప్పుడో ప్రకటించింది. తాజాగా రేసులోకి చంద్రముఖి-2 కూడా చేరింది.
ఇవి కాకుండా.. ఒక రోజు తేడాలో శ్రీకాంత్ అడ్డాల డైరక్ట్ చేసిన పెదకాపు -1ను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇలా ప్రభాస్ తప్పుకున్న తర్వాత చాలా సినిమాలు ఆ తేదీ కోసం పోటీ పడుతుండడం చూసి, రెబల్ స్టార్ ఫ్యాన్స్, సలార్ టీజర్ లోని డైలాగ్ ను వైరల్ చేస్తున్నారు.