ఆంధ్రప్రదేశ్‌లో జనసేనాని పవన్‌కల్యాణ్ వైఖరితోనే జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపిణీ జరగలేదా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే అనూహ్యంగా బీజేపీతో జనసేనాని పొత్తు కుదుర్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఆ సమయంలో పొత్తు కోసం జనసేనాని పవన్‌కల్యాణ్ ఎందుకంతగా వెంపర్లాడారో ఇప్పటికీ అర్థం కాని విషయం.
పవన్‌తో పొత్తు కుదుర్చుకుంటే బలపడుతామని బీజేపీ అనుకుంది. కానీ ఇద్దరూ కలిసి రాజకీయ ప్రయాణం సాగించిన దాఖలాలు అసలే లేవు. తాజాగా కర్నాటకలో బీజేపీ, జేడీ(ఎస్) మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఏపీపై సహజంగానే చర్చకు తెరలేచింది.
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడెనిమిది నెలల సమయం ఉండగానే కర్నాటకలో పొత్తు పొడిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతినడంతో బీజేపీ, జేడీ(ఎస్) మేల్కొన్నాయి. దీంతో కర్నాటకలో లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. మొత్తం 28 ఎంపీ స్థానాలున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో జేడీ(ఎస్)కు నాలుగు సీట్లు ఇచ్చేందుకు కేంద్రహోంశాఖ అమిత్‌షా అంగీకరించారు. మిగిలిన స్థానాల్లో బీజేపీ బరిలో వుంటుంది. ఈ విషయాల్ని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప తెలిపారు.
ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌షాలతో జేడీ (ఎస్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ ఢిల్లీలో చర్చించారు. నాలుగు ఎంపీ సీట్లను దేవెగౌడ కోరగా, ఇచ్చేందుకు బీజేపీ అగ్రనేతలు అంగీకరించినట్టు యడ్యూరప్ప తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 25 ఎంపీ స్థానాల్లో గెలిచింది. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపులో బీజేపీ కీలక పాత్ర పోషించింది. కర్నాటకలో బీజేపీ బలంగా ఉందని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మెరుగైన ఫలితాలను సాధించవచ్చని దేవెగౌడ భావిస్తున్నారు.
ఇదిలా వుండగా ఏపీలో జనసేనతో పేరుకు పొత్తు ఉన్నప్పటికీ, పవన్‌కల్యాణ్ స్థిరమైన రాజకీయ వైఖరి కలిగి వుండకపోవడంతో బలపడలేకపోతున్నట్టు బీజేపీ నేతలు వాపోతున్నారు. పవన్ సరైన రాజకీయ పంథాలో పయనించి వుంటే ఈ పాటికి ఏపీలో రెండు పార్టీల మధ్య సీట్ల పంపిణీ కూడా జరిగి వుండేదని బీజేపీ నేతల అభిప్రాయం. తమతో అధికారిక పొత్తులో వుంటే, టీడీపీతో అనధికారికంగా రాజకీయ ప్రయాణం సాగిస్తుండడం వల్లే తాము కూడా నష్టపోవాల్సి వస్తోందని బీజేపీ నేతలు వాపోతున్నారు.