ప్రశాంతంగా ఉన్న ఏపీ మంటలలో తగలబడిపోవాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటోందని తీవ్ర వ్యాఖ్యలే చేశారు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్. చాలా కాలంగా ఇలాంటి ప్రయత్నాలు టీడీపీ చేస్తోందని, అయినా ప్రభుత్వం పోలీసులు సంయమనం పాటిస్తూ లా అండ్ ఆర్డర్ వీక్ కాకుండా చూసుకొస్తున్నారని ఆయన అన్నారు.
ఇదంతా చంద్రబాబులోనూ ఆయన కుమార రత్నం లోకేష్ లోనూ పేరుకుపోయిన ఆక్రోశం ఓటమి భయం నుంచి వచ్చిన కొత్త ఎత్తులు అని ఆయన ఫైర్ అయ్యారు. రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందే గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అతని కుమారుడు లోకేష్ శవరాజకీయాలు చేసైనా లబ్దిపొందడానికి తాపత్రయ పడుతున్నారని ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు.
పుంగనూరు, భీమవరం ఘటనలు చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది అని ఆయన అంటున్నారు. నారా లోకేష్ లోకేష్ పాదయాత్రలో సంఘవిద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు యువగళం పేరుతో ఎర్ర టీషర్టుల ముసుగులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దాడులకు తెగబడుతున్నారని ధర్మాన ఆరోపించడం విశేషం.
గెలుస్తాం అన్న నమ్మకం ఏకోశాన లేని పార్టీలు, నాయకులు మాత్రమే హింసను ప్రేరేపిస్తారు, ప్రజల్ని రెచ్చగొడతారు. అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తారు. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లు చేస్తున్నదీ అదేనని తన బలమైన అనుమానాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నారు.
పుంగనూరు, భీమవరంలో హింసను ప్రేరేపించడమే కాకుండా, లా అండ్ ఆర్డర్‌ను సవ్యంగా నిర్వహిస్తున్న పోలీసులపైన దాడి చేసి వారి రక్తం కళ్ళజూశారని పేర్కొన్నారు. వీధి రౌడీలు కూడా మాట్లాడలేని భాష చంద్రబాబు, లోకేశ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా, మంత్రులపైనా నోటికొచ్చిన బూతులు తిడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, కులాల్ని, మతాలను రెచ్చగొట్టి ప్రజలు ఆ మంటల్లో కాలిపోతే ఆ మంటల్లో రాజకీయంగా చలి కాచుకోవాలన్నదేనని చంద్రబాబు లోకేష్ తాపత్రయమని ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.