“విమానంలో పాడు పనులు” అనే సిరీస్ కొనసాగుతూనే ఉంది. తాగిన మత్తులో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అదే తరహా ఘటనలు మరిన్ని జరిగాయి. వాటిపై కూడా విచారణలు, సస్పెన్షన్లు సాగుతున్నాయి. ఇప్పుడు మరో ఘటన సంచలనంగా మారింది.
ప్రయాణికులకు సేవలు అందించే విమాన సిబ్బందిలోని ఓ మహిళపై, ఓ విదేశీ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. మస్కట్ నుంచి ఢాకా వెళ్తున్న విస్తారా విమానంలో ఈ ఘటన జరిగింది. వేధింపులకు పాల్పడిన వ్యక్తిని బంగ్లా దేశీయుడిగా గుర్తించారు.
ఇంతకీ ఏం జరిగింది..
మస్కట్ నుంచి ఢాకాకు విస్తారా విమానం వెళ్తోంది. మరో 30 నిమిషాల్లో అది ముంబయిలో ల్యాండ్ అవుతుంది. దీనికి సంబంధించి ఫ్లయిట్ లో ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అంతలోనే ఓ వ్యక్తి సడెన్ గా లేచాడు. సిబ్బందిలోని ఓ మహిళను వెనక నుంచి గట్టిగా వాటేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆమెను ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు.
వెంటనే మహిళా సిబ్బంది గట్టిగా అరిచింది. ఆ వెంటనే తోటి ప్రయాణికులు కూడా అప్రమత్తయ్యారు. సదరు వ్యక్తిని నిలువరించే ప్రయత్నం చేశాడు. అయితే అతడు వినలేదు. అందర్నీ బెదిరించాడు. అదే టైమ్ లో పైలెట్ కూడా ఆ వ్యక్తిని హెచ్చరించాడు. రెడ్ కార్డ్ జారీ చేశాడు.
ఆ వ్యక్తి పేరు మహ్మద్ దలాల్. ఇతడు బంగ్లాదేశ్ జాతీయుడు. వయసు 30 ఏళ్లు. అతడు ఎందుకిలా చేశాడో ఎవ్వరికీ అంతుచిక్కలేదు. విమానయాన సిబ్బంది మాత్రం విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. విమానం గాల్లో ఉన్నప్పుడే కమాండ్ కంట్రోల్ కు సమాచారం అందించారు.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన ముంబయి పోలీసులు, దలాల్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది. ఈమధ్య తరచుగా విమానాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.