పుష్ప సినిమాకు లీకులు కొత్త కాదు. ఆ సినిమా షూటింగ్ మారేడుమిల్లికి షిఫ్ట్ అయినప్పట్నుంచి లీకుల పర్వం మొదలైంది. మినిమం గ్యాప్స్ లో ఏదో ఒకటి సోషల్ మీడియాలో కనిపించేది. ఎప్పుడైతే పుష్ప సినిమా పెద్ద హిట్టయిందో, పుష్ప-2 మూవీ మరిన్ని లీకుల బారిన పడింది.
మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇవి ఆగడం లేదు. ఓవైపు మేకర్స్ అధికారికంగా కొన్ని స్టిల్స్ రిలీజ్ చేస్తుంటే, మరోవైపు లీకువీరులు మరికొన్ని స్టిల్స్ రిలీజ్ చేసి రెచ్చిపోతున్నారు. తాజాగా ఒకేరోజు ఈ రెండూ రిపీట్ అయ్యాయి.
పుష్ప2 సినిమాకు సంబంధించి రష్మిక ఓ ఫొటో షేర్ చేసింది. ఓ ఇంటి సెట్ కు సంబంధించిన ఫొటో అది. ఆ ఫొటో పోస్ట్ చేసి తన ఎక్సయిట్ మెంట్ మొత్తం చెప్పుకొచ్చింది. నిజానికి ఆ ఫొటోలో చెప్పుకోడానికేం లేదు పెద్దగా.
ఇదే విషయాన్ని చాలామంది (అందులో బన్నీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు) అన్నారు. అక్కడితో ఆగలేదు మరికొంతమంది. స్టిల్స్ రిలీజ్ చేస్తే ఇలా ఉండాలంటూ పుష్ప2 నుంచి కొన్ని ఫొటోలు లీక్ చేశారు. భారీ సంఖ్యలో లారీల్ని ఒకేచోట పార్క్ చేసిన స్టిల్ వీటిలో ఎక్కువమందిని ఆకర్షించింది.
ఇలా పుష్ప సినిమాకు సంబంధించి మేకర్స్ ఒకటి రిలీజ్ చేస్తుంటే, అనధికారికంగా 2-3 లీక్ అవుతున్నాయి. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అలాంటిది మరి.