బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొని అడ్డంగా దొరికిన నటి హేమ.. నష్ట నివారణపై దృష్టి సారించారు. దబాయింపులకు దిగారామె. రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ బెంగళూరు పోలీసులకు పట్టుబడ్డారనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. రేవ్ పార్టీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు ప్రయత్నించారు.
బెంగళూరులోని ఫామ్ హౌస్‌లో పోలీసుల అదుపులో వుంటూనే, తన నటనా చాతుర్యానికి పదును పెట్టారు. “అబ్బే… నేను బెంగళూరులో లేను. హైదరాబాద్‌లో ఫామ్‌హౌస్‌లో చిల్ అవుతున్నా. నాపై వస్తున్న వార్తల్ని నమ్మొద్దు” అంటూ చక్కగా నటించి రక్తి కట్టించారు. కేసును పక్కదారి పట్టించడంపై హేమపై బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యారు. ఆ తర్వాత ఆమె బెంగళూరులోనే ఉన్నారంటూ కొన్ని ఫొటోలను అక్కడి పోలీసులు విడుదల చేశారు. అనంతరం ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వదిలిపెట్టారని సమాచారం.
తాజాగా ఆమె మరోసారి రేవ్ పార్టీపై స్పందించారు. ప్రస్తుతానికి తనకు కొంచెం స్పేస్ కావాలని ఆమె కోరారు. రెండు రోజుల్లో మీడియా ముందుకొస్తానని చెప్పారు. అందరి సంగతి తేలుస్తానని ఘాటు హెచ్చరిక చేయడం గమనార్హం. భయంతో పారిపోయే దాన్ని కాదని అన్నారు.
తనపై దుష్ప్రచారం వెనుక ఎవడున్నాడో, ఎందుకు చేయిస్తున్నాడో అన్నీ కనిపెడతానని ఆమె చెప్పుకొచ్చారు. అప్పుడు అందరి సంగతి తేలుస్తానని నటి హేమ తన మార్క్ హెచ్చరిక చేయడం చర్చనీయాంశమైంది. మీడియా ముందుకొచ్చి ఆమె ఏం మాట్లాడ్తారో చూడాలి. ఆమె అనుమానం ఎవరిపైనో అనే చర్చ సినిమా పరిశ్రమలో పెద్ద ఎత్తున సాగుతోంది.