తెలంగాణ తరపున తిరుమలలో సత్రం, కల్యాణ మండపం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దర్శనానికి రావాలని అనుకున్నట్టు చెప్పారు. అయితే ఎన్నికలు, పరిపాలనా పరమైన బిజీ వల్ల రాలేకపోయినట్టు చెప్పారు.
తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరపున సత్రం, వీలైతే కల్యాణ మండపం నిర్మించాలని అనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, ఏర్పడే ప్రభుత్వంతో ఈ విషయమై చర్చిస్తామన్నారు. సత్రం తెలంగాణ భక్తులకే కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతి సౌకర్యంగా ఉపయోగపడుతుందన్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో తాము స్నేహంగా మెలుగుతామన్నారు. తద్వారా ఇరు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడిచేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పాలన అందిస్తోందన్నారు. ఇందుకు ప్రకృతి కూడా సహకరిస్తోందన్నారు.
తెలంగాణ సుభిక్షంగా వుండాలంటే వానలు కురవాలి, పంటలు బాగా పండాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకు తగ్గట్టుగానే వాతావరణం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.