పోస్టల్‌ బ్యాలెట్లపై అత్యాశ.. అతి అంచనాలు!

ఈ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్లపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. గతంలో ఏ ఎన్నికల్లోనూ ఈ అంశం ఇంతగా చర్చనీయాంశం కాలేదు. ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటెత్తి ఓట్లు వేశారని, అందుకే గతంలో ఎన్నడూ లేనంత…

ఈ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్లపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. గతంలో ఏ ఎన్నికల్లోనూ ఈ అంశం ఇంతగా చర్చనీయాంశం కాలేదు. ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటెత్తి ఓట్లు వేశారని, అందుకే గతంలో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో  పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకున్నారని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై ఓ పరిశీలన.

2019 ఎన్నికల్లో రాష్ట్రంలో  2,95,003 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 56,545 ఓట్లు చెల్లలేదు. పోలైన వాటిలో 2,38,458 ఓట్లు చెల్లుబాటయ్యాయి.

చెల్లుబాటైన ఓట్లలో వైసీపీకి 1,36,768 ఓట్లు ద‌క్కాయి. టీడీపీకి 81,608 ఓట్లు వచ్చాయి. జనసేనకు 11,326 ఓట్లు ల‌భించాయి. మిగిలిన 8,756 ఓట్లు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకున్నాయి. శాతాల్లో చూస్తే.. వైసీపీకి 57.35 శాతం, టీడీపీకి 34.22 శాతం, జనసేనకు 4.75 శాతం ఓట్లు లభించాయి. టీడీపీ, జనసేన రెండు పార్టీలకు కలిపి 39 శాతం ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ, జనసేన పార్టీల మధ్య పోస్టల్‌ బ్యాలెట్ల తేడా 18.34 శాతం తేడా వుంది. 

ఈ ఎన్నికల్లో మొత్తం 4,44,218 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోల్చితే 1,49,215 మంది ఉద్యోగులు అదనంగా పోస్టల్‌ బ్యాలెట్‌ వేశారు. ఇంత ఎక్కువ మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వేయటాన్ని ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతంగా టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది.

వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో పెదవి విరుపు వున్నమాట వాస్తవమేగానీ… పోస్టల్‌ బ్యాలెట్ల సంఖ్య పెరగడానికి, ఉద్యోగుల అసంతృప్తికి సంబంధం లేదు. ఈ సారి ఎన్నికల్లో పనిచేసేందుకు ఎన్నికల సంఘం నియమించిన ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగింది. సచివాలయ సిబ్బందితో పాటు అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు, జర్నలిస్టులు ఇలా అందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించారు. అందుకే ఎక్కువ మంది ఆ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. అందువల్లే పోస్టల్‌ బ్యాలెట్ల సంఖ్య పెరిగింది.

ఇక ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత వుందనేది… ఓట్ల లెక్కింపులోగానీ తేలదు. ఉద్యోగుల ఓట్లన్నీ ఏకపక్షంగా తమకే వచ్చాయని టీడీపీ చెబుతోంది. ఇదే సమయంలో తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు పొందిన సచివాలయ ఉద్యోగులు 1.30 లక్షల మంది తమకే ఓట్లు వేశారని వైసీపీ అంటోంది. దీంతో పాటు గత ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓటేసిన వారిలో కనీసం 50 శాతం మందిని తీసేసినా… ఇంకా 50 శాతం మంది తమకే వేశారని అధికార పార్టీ చెబుతోంది. ఈ లెక్కన పోలైన పోస్టల్‌ బ్యాలెట్లలో 2 లక్షలకుపైగా తమకు వస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. 

పేదలకు ఇస్తున్న సంక్షేమ పథకాల వల్లే తమకు జీతాలు ఆలస్యమవుతున్నాయన్నది ఉద్యోగుల్లో జగన్‌ ప్రభుత్వం మీదున్న అసంతృప్తి. ఆ అసంతృప్తి తమకు అనుకూలంగా మారుతుందని టీడీపీ భావిస్తోంది. అయితే… చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో జగన్‌ను మించి సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఇవన్నీ అమలు చేస్తూ తమకు సకాలంలో జీతాలు చెల్లించడం సాధ్యమయ్యే పని కాదని, ఎవరు అధికారంలోకి వచ్చినా ఆర్థిక సమస్యలు తప్పవన్న నిశ్చిత అభిప్రాయం ఉద్యోగుల్లో ఏర్పడింది.

అందుకే జగన్‌ మీద వున్న అసంతృప్తి, వ్యతిరేకత ఓటు మీద ప్రభావం చూపేంతగా లేదన్నది పరిశీలకుల అంచనా. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్లపై ఎక్కవ ఆశలు పెట్టుకుంటే నిరాశ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.