ఈవీఎం ధ్వంసంపై కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) సీరియస్ అయ్యింది. రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామంలోని ఒక పోలింగ్ బూత్‌లో ఈవీఎంను మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటికొచ్చింది. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది.
ఈవీఎం ధ్వంసంలో మాచర్ల ఎమ్మెల్యే పాత్ర వుంటే వెంటనే అరెస్ట్ చేయాలని సీఈసీ ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ సాయంత్రం ఐదు గంటలకల్లా ఇవ్వాలని ఏపీ సీఈవో ముకేశ్‌కుమార్ మీనాను కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఏపీ సీఈవోకు పంపిన నోటీసులో మాచర్ల ఎమ్మెల్యే పాత్ర వుంటే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది.
ఎమ్మెల్యే పాత్ర వుంటే, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇదిలా వుండగా ఈవీఎంను ధ్వంసం చేస్తూ వీడియోలో కనిపించిన ఎమ్మెల్యేపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీస్ బలగాలు హైదరాబాద్‌కు వెళ్లినట్టు సమాచారం. పిన్నెల్లి అనుచరుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు తప్పించుకున్నారు.
పిన్నెల్లి హైదరాబాద్‌లో ఉన్నట్టు సమాచారం అందడంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఏ క్షణాన్నైనా పిన్నెల్లిని అరెస్ట్ చేయవచ్చు. ఎన్నికల ఎపిసోడ్లో మాచర్ల ఎమ్మెల్యే అరెస్ట్‌కు దారి తీయడం చర్చనీయాంశమైంది.