తమతో నటించిన సహనటుడిని లేదా సహనటిని వివాహం చేసుకున్న తారలు అనేక మంది ఉన్నారు. ఈ జాబితా పెరుగుతూనే ఉండటం గమనార్హం. ధర్మేంద్ర- హేమమాలిని, అమితాబ్- జయబాధురీ లతో మొదలుపెడితే, బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ వంటి తేడాల్లేకుండా బోలెడంతమంది తారలు ఇలాంటి వివాహాలు చేసుకున్నారు.
తెలుగులో నాగార్జున- అమల, జీవిత- రాజశేఖర్, తమిళంలో భాగ్యరాజ్- పూర్ణిమ వంటి వారితో పాటు ఈ జాబితాలో చాలా మందే ఉంటారు. సినిమాల షూటింగ్ లో భాగంగా దీర్ఘకాలంపాటు సన్నిహితంగా గడిపే సందర్భాల్లో హీరోహీరోయిన్లు ప్రేమలో పడటం జరుగుతుందేమో!
ఈ జాబితాలో తాజాగా చోటు చేసుకుంటున్నారు సిద్ధార్థ్ మల్హోత్రా- కియరా అద్వానీ. ఈ మధ్యకాలంలో ఇలాంటి వివాహాలు ట్రెండీగా జరుగుతుండటం మరో విశేషం. రణ్ వీర్ సింగ్ -దీపికా, ఆ తర్వాత రణ్ భీర్ కపూర్- అలియా ఇంకా కత్రినాకైఫ్- విక్కీ కౌశల్.. ఇలా బాలీవుడ్ లో ప్రముఖ నటీనటులు దంపతులు అవుతూ ఉన్నారు.
అభిషేక్- ఐశ్వర్య, కరీనా – సైఫ్ అలీఖాన్, ట్వింకిల్ ఖన్నా- అక్షయ్ కుమార్, జెనీలియా- రితీష్ దేశ్ ముఖ్,అజయ్ దేవగణ్ – కాజోల్ ఇలా ఎంతో మంది ఈ జాబితాలో ఉన్నారు. హాలీవుడ్ లో కూడా ఇలాంటి సహనటీనటులతో వివాహాల జాబితా ఉంటుంది.
దర్శకులనో, నిర్మాతలనో, ఇతర టెక్నీషియన్లనో హీరోయిన్లు వివాహం చేసుకునే సంగతలా ఉంటే, నటీనటులే వివాహాలు ఎప్పటికప్పుడు కొనసాగే ట్రెండ్. సమంత- నాగచైతన్య తరహాలో కొందరు తక్కువకాలంలోనే విడిపోయినా.. హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకోవడం మాత్రం చాలా మంది విషయంలో సినిమావారి వివాహానికి విజయ సూత్రమే!