పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించారు. కొన్నాళ్లుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన, ఈరోజు దుబాయ్ లోని అమెరికన్ హాస్పిటల్ లో మృతిచెందారు. ఈయన మరణవార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
ముషారఫ్ భౌతికకాయాన్ని పాకిస్థాన్ కు తీసుకొస్తారా లేదా అనే విషయంపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. తన జీవితాంతం పాకిస్థాన్ లో గడపాలనేది ముషారఫ్ కోరిక. ఆ కోరికను నెరవేర్చేందుకు కుటుంబ సభ్యులు రెండేళ్లుగా చాలానే కష్టపడుతున్నారు. కనీసం అంతిమయాత్ర అయినా పాక్ లో జరిపించాలనేది వాళ్ల కోరిక.
నయంకాని అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు ముషారఫ్. ఈ వ్యాధి కారణంగా ఆయన కండరాల్లోని కణజాలం రోజురోజుకు క్షీణించిపోతుంది. ఒక్కొక్క అవయవం పనితీరు మందగించి, చివరికి పనిచేయకుండా పోతుంది. ప్రొటీన్ నిర్మాణంలో లోపాల వలన వచ్చే అరుదైన జబ్బు ఇది.
మాజీ పాక్ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ముషారఫ్. అప్పట్నుంచి ఆయన దుబాయ్ లోనే ఆశ్రయం పొందుతున్నారు. ఎప్పటికైనా పాక్ కు తిరిగిరావాలనేది ఆయన కల. ఆ కల నెరవేరకుండానే ఆయన మరణించారు.
1943లో ఢిల్లీలో జన్మించారు ముషారఫ్. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్థాన్ కు వలసవెళ్లింది. ముషారఫ్ తండ్రి విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. తల్లి ఉపాధ్యాయురాలు. 18 ఏళ్లకు సైన్యంలో చేరిన ముషారఫ్, అంచెలంచెలుగా ఎదిగి సైన్యంలో కీలకమైన స్థానాలకు చేరుకున్నారు.
కశ్మీర్ లో సైనిక తిరుగుబాటుకు యత్నించిన ముషారఫ్ ను అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పదవి నుంచి తొలిగించే ప్రయత్నం చేశారు. అయితే అంతకంటే ముందు ముషారఫ్, సైనిక తిరుగుబాటు చేసి నవాజ్ షరీఫ్ ను పదవీచ్యుతుడ్ని చేసి, తను పాక్ అధ్యక్షుడిగా మారారు.
ముషారఫ్ సైన్యాధ్యక్షుడిగా, దేశ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారత్-పాక్ సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అంతేకాదు, కార్గిల్ యుద్ధానికి కారకుడు కూడా ముషారఫే.