సోషల్ మీడియాలో ఎవ్వరు ఎప్పుడు బుక్ అవుతారో ఎవ్వరూ చెప్పలేరు. సమయం, సందర్భం లేకుండా ట్రోలింగ్ కు గురవుతుంటారు సెలబ్రిటీలు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తమన్, ఇప్పుడీ ట్రోలింగ్ కు గురవ్వాల్సి వచ్చింది. ఏకంగా తమన్ కు వ్యతిరేకంగా ఓ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి మరీ వైరల్ చేశారు. వాళ్లు ఇంకెవరో కాదు, మహేష్ బాబు ఫ్యాన్స్.
మహేష్-త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తమన్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇప్పటిది కాదు. చాన్నాళ్ల కిందటే జరిగింది. దుబాయ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగాయి. అయితే ఇప్పుడు మాకు తమన్ వద్దంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆందోళన ప్రారంభించారు.
“#RemoveThamanFromSSMB28” అనే హ్యాష్ ట్యాగ్ ను నిన్నంతా ట్రెండ్ చేసి పడేశారు మహేష్ అభిమానులు. తమ హీరో సినిమాలకు తమన్ సరైన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం లేదనేది వీళ్ల వాదన. ఇతర హీరోల సినిమాలపై పెడుతున్న శ్రద్ధను, మహేష్ బాబు మూవీస్ పై తమన్ పెట్టడం లేదంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.
తనకు వ్యతిరేకంగా వేలకొద్దీ వస్తున్న ట్వీట్లతో తమన్ కూడా విసిగెత్తిపోయాడు. తప్పనిసరి పరిస్థితుల మధ్య స్పందించాడు కూడా. “నెగెటివిటీ రెస్ట్ ఇన్ పీస్” అంటూ తన ఫొటో ఉన్న చిన్న గ్రాఫిక్ వీడియోను రిలీజ్ చేశాడు.
సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్స్ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. స్టార్ట్ ఎవ్వరూ వీటిని పట్టించుకోవడం లేదు. మొన్నటికిమొన్న ప్రభాస్-మహేష్ అభిమానుల మధ్య గంటల తరబడి ఏకథాటిగా ట్వీట్ల యుద్ధం నడిచింది. కాబట్టి తమన్ కూడా సైలెంట్ గా ఉంటే సరిపోయేదు.
తమన్ రియాక్ట్ అవ్వడంతో, ఈ వ్యతిరేకత ఇప్పుడు మరింత పెరిగింది. గతంలో తమన్ కాపీ చేసిన ట్యూన్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్లను మరింత విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మహేష్ అభిమానులు.