తెలంగాణా ఏర్పడాలని కేసీఆర్ కోరుకోలేదా? 

తెలంగాణా రావడానికి తాను చేసిన పోరాటమే కారణమని సీఎం కేసీఆర్ చెప్పుకుంటారు. తాను నిరాహార దీక్ష చేసి ప్రాణాలను పణంగా పెట్టినందువల్లనే తెలంగాణా వచ్చిందని అంటారు. తెలంగాణా ఇచ్చింది సోనియా గాంధీ అని, తెచ్చింది…

తెలంగాణా రావడానికి తాను చేసిన పోరాటమే కారణమని సీఎం కేసీఆర్ చెప్పుకుంటారు. తాను నిరాహార దీక్ష చేసి ప్రాణాలను పణంగా పెట్టినందువల్లనే తెలంగాణా వచ్చిందని అంటారు. తెలంగాణా ఇచ్చింది సోనియా గాంధీ అని, తెచ్చింది తామేనని తెలంగాణా కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటారు. చిన్న రాష్ట్రాలు తమ విధానమని, తాము మద్దతు ఇవ్వబట్టే తెలంగాణా వచ్చిందని బీజేపీ నాయకులు చెప్పుకుంటారు. ఇలా ఎవరి కథలు వారు వినిపిస్తూ ఉంటారు. 

తెలంగాణా కోసం ఎప్పటినుంచో పోరాటాలు జరిగినా వివిధ కారణాల వల్ల విఫలమయ్యాయి. చివరకు తెలంగాణా రావడానికి ఏ ఒక్కరి పోరాటమో కారణం కాదు. అన్ని వర్గాల వారూ, అన్ని పార్టీల వారూ పోరాటం చేశారు. తెలంగాణా రావడానికి సోనియా గాంధీ రాజకీయ స్వార్ధం లేదా ప్రయోజనాలు కూడా ఒక కారణం. అయితే చివరకు క్రెడిట్ అంతా కేసీఆర్ తన్నుకుపోయాడనుకోండి. అది వేరే విషయం.

రామాయణంలో పిడకల వేట మాదిరిగా తెలంగాణా బీజేపీ నాయకురాలు విజయశాంతి ఓ కొత్త విషయం చెప్పింది. ఆమె బీజేపీలో కూడా అసంతృప్తిగా ఉన్న విషయాన్ని ఆ పార్టీ నాయకులు గ్రహించారు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఆమె రాజకీయ జీవితం మొదలుపెట్టి పాతికేళ్ళు పూర్తైన సందర్భంగా ఘనంగా సన్మానం చేశారు. ఆ సంతోషంలో ఆమె ఎమోషనల్ ప్రసంగం చేసింది.

పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ రాకూడదనే కేసీఆర్ సహా చాలా మంది ఎంపీలు భావించారని చెప్పింది. తన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణకు సేవ చేసుకుంటానని.. ఈ ఒక్కసారి గట్టిగా పనిచేస్తే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, బండి సంజయ్ నాయకత్వంలోనే మళ్లీ ఎన్నికల్లోకి పోతున్నామని.. మోదీ పీఎం అవుతారని ధీమా వ్యక్తం చేసింది. 

నాది 25 ఏళ్ల రాజకీయం ప్రస్థానం.. చాలా పెద్ద ప్రయాణం అని చెప్పింది విజయశాంతి. 1998 జనవరి 21న వాజ్ పేయి, అద్వానీలను కలిశానని, తనకు బీజేపీ సిద్ధాంతాలు నచ్చాయని చెప్పింది. అవినీతి లేని, క్రమశిక్షణ కలిగిన పార్టీ ప్రజలకు మేలు చేస్తుందని తన నమ్మకం అంది. తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చాననని.. తనకు పదవులపై ఆశ లేదని చెప్పింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే కోరికే ఉండేదని.. ఆ రోజు సమైక్యవాద నాయకులు తెలంగాణ రాకుండా అడ్డుకున్నారని విజయశాంతి అన్నది. అందుకే సమైక్యవాదులతో పోరాడేందుకు తల్లి తెలంగాణ పార్టీ పెట్టానని.. అయితే ఆరోజు బీజేపీని వీడినందుకు ఏడ్చానని చెప్పింది. నాలుగున్నరేళ్లు పార్టీని నడిపి ఎన్నో సమస్యలపై పోరాడానని.. ఆ సమయంలో ఒక రాక్షసుడు (కేసీఆర్) ఎదురయ్యాడని, తెలంగాణ పేరుతో ముసుగు కప్పుకుని వచ్చి నమ్మించి మోసం చేశాడని వాపోయింది.

తన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి పూనుకున్నాడని, తన పార్టీని ఆయన పార్టీలో విలీనం చేసినప్పటి నుంచి తాను ఏనాడూ ప్రశాంతంగా లేనంది. ఎంతో టార్చర్ అనుభవించానని.. ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఓడగట్టేందుకు కుట్ర చేశారని ఆమె చెప్పింది. 2013లో తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాగానే అదే రోజు రాత్రి తనను సస్పెండ్ చేశారని.. తన తప్పేమిటో చెప్పలేదని అన్నది. అయితే తనకు విముక్తి కలిగినందుకు ఆనందం వ్యక్తం చేశానే తప్ప బాధపడలేదని చెప్పింది. ఆమె బీజేపీని విడిచిపెట్టినప్పుడు యేడ్చివుంటే టీఆర్ఎస్ ను వదిలాక వెంటనే బీజేపీలో చేరాల్సింది. కానీ అలా చేయకుండా కాంగ్రెస్ లోకి వెళ్ళింది. దాని నుంచి బయటకు వచ్చాక బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీలో చేరింది.