తెలుగుదేశం వర్గాల ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరుతున్నట్టుంది. బహుశా వచ్చే ఎన్నికల్లో కూడా విజయం మీద అనుమానాలు నెలకొని ఉండటం చేతనో ఏమో కానీ.. ఆఖరికి సినిమాల్లోనూ, టాక్ షో ల్లో కూడా కారుకూతలు అధికం అవుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి మీడియా అండ ఉంది. తమ రాజకీయ ప్రత్యర్థులపై మీడియా ముసుగులో దాడి చేయించడం కొత్త కాదు. దశాబ్దాల నుంచి అది జరుగుతున్నదే! అది ఎప్పుడూ ఉంటుంది.
ఇప్పుడు తెలుగుదేశం ప్రత్యర్థి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై యథారీతిన పచ్చమీడియా దాడి కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉండే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం అయిన పరాజయం, వచ్చే ఎన్నికల్లో సోలోగా విజయంపై ఎలాంటి ధీమా లేకపోవడం, అందుకోసం పవన్ కల్యాణ్ కలిసి రావడానికి రెడీగానే ఉన్నా.. ఇంకా విజయంపై ధీమా లేదు. ఇలాంటి నేపథ్యంలో పచ్చవర్గాల ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడుతూనే ఉంది. తమపై రాజకీయ విమర్శలకు సమాధానం ఇచ్చుకోలేక, ప్రజాదరణ ద్వారా సమాధానం ఇచ్చే దమ్ములేక పచ్చవర్గాలు సినిమాలు, ఆహా టాక్ షోలను వాడుకుంటూ విషం గక్కుతున్నాయి!
ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ ధోరణి వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలి తన సినిమాలో కూడా బాలకృష్ణ ఏవేవో డైలాగులు పెట్టించుకున్నాడు. అధికారంలో ఉన్న వారిని విలన్లుగా చూపించుకుంటూ తనకు హీరోయిజాన్ని ఆపాదించుకున్నాడు. అదే అనుకుంటే.. ఆహా టాక్ షో వేదికగా పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై విమర్శలను చేసే వాళ్లు ఊరకుక్కలు అని వ్యాఖ్యానించాడు!
పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి ఇలా బాలకృష్ణ వకాల్తా పుచ్చుకున్నాడు! ఇప్పుడు పవన్ కల్యాణ్ తో రాజకీయ స్నేహం మీదే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కాబట్టి.. ఇలా అన్ని రకాలుగానూ పవన్ వెనక్కు వేసుకువస్తున్నారు. దీనికి ఆహా అవకాశాన్ని వాడుకున్నారు.
అయితే పవన్ తన పెళ్లిళ్ల గురించి చెబుతున్న తీరే ప్రహసనంగా ఉంది. పవన్ కల్యాణ్ చెబుతున్న పెద్ద అబద్ధం తను ఒకరికి విడాకులు ఇచ్చి మరొకరిని పెళ్లి చేసుకున్నట్టుగా చెప్పడం. రేణూ దేశాయ్ తో సహజీనం, పిల్లలు కలిగిన తర్వాత మాత్రమే పవన్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. తనతో వైవాహిక జీవితంలో ఉండగానే.. మరొకరితో పిల్లలు కన్నాడంటూ పవన్ కల్యాణ్ గురించి రేణూ దేశాయ్ కూడా చెప్పింది! మరి పెళ్లిళ్ల గురించి పవన్ చెబుతున్నవి అన్నీ ఫక్తు అబద్ధాలు అని ఇలా తేటతెల్లం అవుతోంది! మరి ఇలాంటి అంశం గురించి బాలకృష్ణ ఇలా మాట్లాడం గమనార్హం!
అయినా పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన వారి గురించి చర్చ జరుగుతుంది. దీనికి ధైర్యం ఉంటే సమాధానం ఇవ్వాలి, అంతేకానీ.. విమర్శలు చేసిన వారిని కుక్కలు, నక్కలు అంటే సరిపోదు! అయినప్పటికీ బాలకృష్ణ చూపిన అత్యుత్సాహం ఫ్రస్ట్రేషన్ ను చాటుతోంది.
రాజకీయంగా సత్తా చూపలేక, ప్రజల మధ్యకు వెళ్లి మాట్లాడలేక, కనీసం నియోజకవర్గం సమస్యలను పట్టించుకోలేని బాలకృష్ణ ఇలా సినిమాల్లోనూ, ఆహా టాక్ షోలోనూ డైలాగులు చెప్పుకుంటూ ఉంటే.. దీన్నే సిసలైన శునకానందం అంటారు తెలుగులో!
-జీవన్