టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కృషి ప్రారంభించింది. ఏకంగా ఒకేసారి సినిమాల నిర్మాణం బంద్ పెట్టడం కాకుండా, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు.
సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించడానికి, ఆ సమస్యల గురించి వివిధ వ్యక్తులతో, సంస్థలతో మాట్లాడడానికి కొన్ని కమిటీలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు.
హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సీనియర్ నటులు, దర్శకులు, ఫెడరేషన్ నాయకులు ఇలా వివిధ విభాగాలను గుర్తిస్తున్నారు. ఆ తరువాత ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల నుంచి ఒక్కొక్కరిని తీసుకుని ఒక్కో కమిటీ ఫార్మ్ చేస్తారు. ఎవరి దగ్గరకు ఆ కమిటీ వెళ్తుంది అన్న దాన్ని బట్టి, అందులో సభ్యులుగా ఎవరు వుండాలి అన్నది డిసైడ్ చేస్తారు.
ఈ కమిటీ సభ్యులు వెళ్లి టాలీవుడ్ సమస్యలను వివరిస్తారు. హీరోలు, సీనియర్ నటుల దగ్గరకు వెళ్తే పారితోషికాలు, టైమింగ్ లు ఇలా, దర్శకుల దగ్గరకు వెళ్తే నిర్మాణ వ్యయం, సెట్ లు, షెడ్యూళ్ల ఇలా అన్నమాట. ఇలా అన్ని కమిటీలు అందరి దగ్గరకు వెళ్లి సమస్యలు వివరించి, వారి నుంచి సూచనలు రాబట్టిన తరువాత గిల్డ్ లో డిస్కస్ చేస్తారు.
ఇలా చేయడం వల్ల హడావుడిగా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్న అపవాదు రాదు. ఈ లోగా గిల్డ్ కు సమాంతర బాడీ అయిన కౌన్సిల్ కూడా సభ్యులతో చర్చించి, ఆ సూచనలను గిల్డ్ కు అందచేస్తుంది. మొత్తం మీద టాలీవుడ్ సమస్యలు ఓ కొలిక్కి తేవడానికి మాత్రం గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి.