వాస్తవానికి చాలా మంది హీరోయిన్లు తమ ఎమోషన్లతో ఆస్తులను, డబ్బును కోల్పోయారని సినీ ఇండస్ట్రీ చరిత్ర చెబుతోంది. వైవాహిక జీవితం విషయంలో హీరోయిన్లది ఎప్పుడూ ప్రయోగం లాంటిదే! డబ్బులున్న వాడిని చేసుకున్నా, డబ్బు లేని వాడిని చేసుకున్నా.. పొందిక అంత తేలిక కాదు! ఇలాంటి వైవాహిక జీవిత వైఫల్యాల విషయంలో హీరోయిన్లనే సులువుగా నిందిస్తుంది సమాజం!
స్త్రీలను తేలికగా నిందించడం అత్యంత సహజమిక్కడ! ఆ సంగతలా ఉంటే.. ఎవడితో అయినా కనెక్ట్ అయినా హీరోయిన్ డబ్బు కోసమే అనడం, ఎవరితో డిస్ కనెక్ట్ అయినా డబ్బు కోసమే అనడం పరమ రొటీన్. ప్రస్తుతం సుస్మితా సేన్ కు తెగ నీతులు చెబుతోంది సమాజం! లలిత్ మోడీతో ఆమె బంధం కేవలం డబ్బు కోసమే అని తేల్చి చెబుతున్నారు నెటిజనులు.
అయితే ఈ తరహా నిందలు ఈ మధ్యకాలంలో మోస్తోంది కేవలం సుస్మిత మాత్రమే కాదు! పలువురు నటీమణులు ఇదే తరహాలో నిందలకు గురయ్యారు గత కొంతకాలంలోనే! ఆ జాబితాలో సమంత, రియా చక్రబర్తి, మలైకా అరోరా వంటి వారున్నారు!
నాగచైతన్యతో విడాకుల వ్యవహారంలో సమంతను చాలా మంది నిందించారు. ఆమె నాగచైతన్యతో విడిపోతే వచ్చే భరణం కోసమే అతడిని పెళ్లి చేసుకుందంటూ విడాకుల తర్వాత బోలెడు వ్యాఖ్యానాలు వినిపించాయి. నాగచైతన్య కుటుంబానికి ఉన్న భారీ ఆస్తుల నేపథ్యంతో అతడితో ఆమె ప్రేమ నాటకాన్ని ఆడి పెళ్లి వరకూ వెళ్లిందని, విడిపోతే వచ్చే భరణం కోసం విడాకుల దిశగా సాగిందనే నిందలు తీవ్రంగా వేశారు.
అయితే ఇందుకు అధికారిక ధ్రువీకరణ ఏమీ లేదు! నాగచైతన్యతో విడాకులకు గానూ సమంత సెటిల్ చేసుకున్న దాఖలాలు చట్టపరంగా ఎక్కడా లేవు కూడా! అయితే సమంత మాత్రం తీవ్ర నిందలు భరించక తప్పని పరిస్థితి!
ఇక బాలీవుడ్ నటి రియాచక్రబర్తి అయితే.. విషకన్య అంటూ తీవ్ర విమర్శల పాలయ్యింది. ఆమె ఏమీ బిగ్ షాట్ తో ప్రేమ వ్యవహారాలను నడపలేదు. ఒక సాధారణ స్థాయి హీరోతో ప్రేమను సాగించింది. ఆమె అతడి డబ్బుతో జీవించిందంటూ.. అతడి చావుకు కూడా కారణం అయ్యిందంటూ రియా చాలా మందికి విలన్ అయ్యింది. బిహార్ ఎన్నికల రాజకీయంలోకి కూడా రియాను లాగి రచ్చ రచ్చ చేశారు!
ఇక సల్మాన్ ఖాన్ తమ్ముడికి విడాకులు ఇచ్చిన మలైకా అరోరా కూడా డబ్బుల కోసం పరితపించిందంటూ తెగ కామెంట్లు వచ్చాయి! సల్మాన్ తమ్ముడు ఎలాంటి వాడైనా ఆమె అతడితో కాపురం చేయాల్సిందే అంటూ తెగ నీతులు చెప్పారు నెటిజన్లు. అయితే వీటిని లైట్ తీసుకుని తనకు నచ్చిన జీవితాన్ని మలైకా గడుపుతోంది. దీని వల్ల బయటి వాళ్లకు వచ్చే నష్టం లేదు! అయితే.. నీతులు వల్లెవేయడం జనాలకు హాబీ. ఇలాంటి క్రమంలో హీరోయిన్లను విలన్లుగా చిత్రీకరించడం కొత్త కాదు!