ట్రంప్ వచ్చాడు. నట్టులు-బోల్టులు బిగించాడు. భారతీయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పార్ట్ టైమ్ జాబ్స్ కోల్పోతున్నారు. మరీ ముఖ్యంగా విద్యార్థులు కిందామీద పడుతున్నారు. చిన్న తప్పు జరిగినా తిరిగి ఇండియాకు వెళ్లిపోవాల్సి వస్తుందని భయపడుతున్నారు. ఈ ఉద్రిక్తత బాక్సాఫీస్ పై కూడా పడుతుందనే అంచనాలున్నాయి.
ఒకప్పట్లా ఓవర్సీస్ బాక్సాఫీస్ లో దూకుడు కనిపించక పోవచ్చని, తెలుగోళ్లు ఆచితూచి థియేటర్లకు వస్తారని, ఆ ప్రభావం వసూళ్లపై కనిపిస్తుందని అంచనాలు కట్టారు. అయితే అందరి అంచనాల్ని తలకిందులు చేశాడు నాని.
హిట్-3 సినిమాకు ఓవర్సీస్ లో మంచి వసూళ్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కళ్లముందే ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడంతో చాలామంది మనసుల్లో ఉన్న భయాలు తొలిగిపోయాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పట్లానే సినిమాలు చూస్తున్నారనే ధైర్యాన్ని టాలీవుడ్ కు అందించింది హిట్-3.
రీసెంట్ గా వచ్చిన సినిమాలేవీ ఓవర్సీస్ లో చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించలేదు. ఉన్నంతలో మ్యాడ్ స్క్వేర్ మాత్రమే ఆకట్టుకుంది. అయితే అది కూడా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడానికి కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంది. ఇక అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల-2, రాబిన్ హుడ్ లాంటి సినిమాల సంగతి సరేసరి.
దీంతో యూఎస్ బాక్సాఫీస్ పై ఎవరూ ఓ అంచనాకు రాలేకపోయారు. ఎట్టకేలకు హిట్-3 రాకతో బయ్యర్లకు ఓ క్లారిటీ వచ్చింది. తెలుగు ప్రేక్షకుల మూడ్ ఎలా ఉందో అర్థమైంది.
ప్రస్తుతం ఈ ఊపును మరింత ముందుకు తీసుకెళ్లే పనిలో అమెరికాలో బిజీగా ఉన్నాడు నాని. ఇక్కడ సినిమా రిలీజైన వెంటనే, అక్కడ వాలిపోయిన నాని, మరో 3 రోజుల పాటు హిట్-3 సినిమాను యూఎస్ లో గట్టిగా ప్రమోట్ చేయబోతున్నాడు. తిరిగొచ్చి హైదరాబాద్ లో హంగామా చేస్తాడు.
Bookmyshow lo anni seats empty gaaaa vunnai
B and C classes lo Movies chuddam nasaru emo today only 14 people in Gooty Theater