ఆ సినిమాను చూస్తే.. అంతా పూర్తయ్యాకా కలిగే పెద్ద నిరాశ ఏమిటంటే.. ఇదంతా అబద్ధమా! అనేది. తొలి సారి ఆ సినిమాను చూస్తున్నప్పుడు.. బహుశా అదంతా నిజంగా జరిగిందేమో అనే ఎక్సయిట్మెంట్ తో క్లైమాక్స్ ఏమవుతుందో అనే ఆసక్తి కలుగుతుంది. అయితే క్లైమాక్స్ పూర్తయ్యాకా అది కల్పితం అనే విషయం స్పష్టం అవుతుంది. క్లైమాక్స్ మాత్రమే కల్పితమా? లేక సినిమా మొత్తం కల్పితమా అనే రీసెర్చ్ మొదలుపెట్టాల్సి వస్తుంది. అలా ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించే సినిమా ' ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్'. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్వెంటిన్ టరంటినో దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కల్పిత చరిత్రతో వచ్చి ఆకట్టుకున్న క్లాసిక్ అని చెప్పవచ్చు.
జర్మన్ ఒకనాటి నియంత అడాల్ఫ్ హిట్లర్ ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయని చరిత్ర చెబుతుంది. ఎన్నో కుట్రలను ఎదుర్కొని నిలబడిన కుట్రదారు హిట్లర్. స్వదేశంలోనే హిట్లర్ ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయని జర్మన్ రికార్డులే చెబుతాయి. అలాంటి హిట్లర్ ను చంపడానికి సినిమా రూపకంలో జరిగిన ఒక ప్రయత్నం ఈ సినిమా అని చెప్పొచ్చు! ఈ సినిమాలో హిట్లర్ ను విజయవంతంగా చంపగాలిగారు! వాస్తవానికి హిట్లర్ ను ఎవరూ చంపలేదు. తన భార్యాపిల్లలను కాల్చి చంపి, హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఒక వెర్షన్. అలా కాదు..వారంతా సామూహిక ఆత్మహత్య చేసుకున్నారనేది మరో వెర్షన్. హిట్లర్ కర్కశత్వాన్ని బట్టి ఏది రైటో అంచనాకు రావొచ్చు.
అలా ఆత్మహత్య చేసుకున్న హిట్లర్ చరిత్రను మరో రకంగా.. పూర్తిగా కల్పితంగా చూపి.. యూధుల చేతిలో హిట్లర్ మరణిస్తే అతడి చావు ఎలా ఉండేదనే కథాంశాన్ని వండివార్చాడు టరంటినో.
చరిత్రకు సంబంధించిన సినిమాల్లో కల్పితాలు చాలానే ఉంటాయి. వ్యక్తులను గ్లోరిఫై చేయాలనుకునే ఉద్దేశాలతో సినిమాలు తీసినప్పుడు గోరంతలను కొండతలు చేయడం, చరిత్రను పూర్తిగా వక్రీకరించడం కూడా చూస్తుంటారు ప్రేక్షకులు. ఆ మధ్య తెలుగులో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఆయన సినిమాల గురించినే తప్పుడు వివరాలను ఇచ్చారు. ఎన్టీఆర్ తన రూమ్ మేట్స్ అందరికీ లైఫ్ ఇచ్చేసినట్టుగా చూపి నకిలీ చరిత్రను తెరకెక్కించారనే విమర్శలు వచ్చాయి. ఆఖరికి ఎన్టీఆర్ కు సినీ జీవితాన్ని ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ వాళ్లను కూడా ఎన్టీఆర్ బయోపిక్ రూపకర్తలు ఇబ్బంది పెట్టారు. అలాంటి వక్రీకరణలు వేరే. ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్ విషయానికి వస్తే.. ఇది పూర్తిగా కల్పిత చరిత్ర.
వాస్తవ ఘటనల ఆధారంగా చేసుకుని తాము కల్పిత కథను తెరకెక్కించామని ఈ సినిమా మేకర్లు ముందే ప్రకటించుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధకాలానికి సంబంధించి ఎన్నో అంశాల ఆధారంగా సినిమాలు వచ్చాయి. వాటి సంఖ్య లెక్కకు మిక్కిలి. అన్ని కథాంశాలను హాలీవుడ్ కు, యూరోపియన్ మూవీ మేకర్స్ కు ఇచ్చింది సెకెండ్ వరల్డ్ వార్. అయినా అవన్నీ సరిపోవన్నట్టుగా టరంటినో ఒక కల్పిత చరిత్రను తెరకెక్కించాడు.
ఫ్రాన్స్ ను ఓడించి జర్మనీ ఆ దేశాన్ని తన చెప్పుచేతల్లోకి తీసుకున్న పరిణామాల నుంచి సినిమా ప్రారంభం అవుతుంది. అంత వరకూ తమ మధ్యన, తమకు స్నేహితులు, సన్నిహితులుగా మెలిగిన యూధులను జర్మన్లు వేటాడటాన్ని సహించలేరు కొంతమంది ఫ్రెంచి క్రైస్తవులు. వారికి ఆశ్రయం కల్పించి, వారిని దాచి కాపాడుతుంటారు. యూధులను వెంటాడి, వేటాడటమే పనిగా పెట్టుకున్న నాజీ సేనలు అలా అజ్ఞాతంలో దాగిన వారిని కనిపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలా యూధులకు ఆశ్రయం ఇచ్చిన ఒక క్రైస్తవ కుటుంబాన్ని నాజీ సేనలు చుట్టుముడతాయి. ఆ ఇంటి యజమానిని భయపెట్టి అతడు దాచిన యూధు కుటుంబాన్ని బంకర్ లోనే అంతం చేస్తాడు ఒక నాజీ అధికారి. ఆ సమయంలో ఆ యూధు కుటుంబంలోని ఒక పాప తప్పించుకుని పారిపోతుంది.
తన కుటుంబాన్ని చంపిన నాజీలపై అపరిమితమైన కసితో ఆ అమ్మాయి పెరుగుతుంది. మరోవైపు యూరప్ లోకి ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ ప్రవేశిస్తారు. అమెరికాలో తీర్చిదిద్దిన సుశిక్షిత సైనికులు వీరు. వీళ్ల ప్రత్యేకత ఏమిటంటే వీళ్లంతా యూధులు. యూరప్ లో నాజీలు యూధులపై సాగిస్తున్న మారణకాండతో వారు రగిలిపోతూ ఉంటారు. యూధులపై నాజీలు ఎంత కర్కశత్వంతో వ్యవరిస్తుంటారో, నాజీలు దొరికితే అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యే, పచ్చి రక్తం తాగే రాక్షసుల్లాంటి వారు ఈ బాస్టర్డ్స్. ఒక్కో ఇంగ్లోరిస్ బాస్టర్డ్ వంద మంది నాజీలను చంపి, వారి స్కాల్ప్ లను తీసుకెళ్లాలనే లక్ష్యంతో రెచ్చిపోతూ ఉంటారు. వారి అంతిమ టార్గెట్ హిట్లర్. అతడిని చంపడానికి వారు ప్రణాళికను రచిస్తూ ఉంటారు.
ఫ్రాన్స్ ఏలుబడి కోసం వచ్చిన నాజీలను వారు అంతం చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో హిట్లర్ ఫ్రాన్స్ కు రాబోతున్నాడని వారికి తెలుస్తుంది. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, నాజీల హీరోయిజం గురించి హిట్లర్ ఒక సినిమాను నిర్మించాడని, దాన్ని ఫ్రాన్స్ లో ప్రదర్శితం చేయనున్నారని వారికి తెలుస్తుంది. హిట్లర్ ను చంపడానికి దాన్నే వేదికగా చేసుకోవాలని ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ ప్లానేస్తారు. ఒక ఫ్రెంచ్ హీరోయిన్ వీరికి ఏజెంట్ గా పని చేస్తూ ఉంటుంది. ఆమె సాయంతో సినిమా టెక్నీషియన్స్ గా ఆ థియేటర్లోకి ఆమె వెంట ఎంటరవుతారు.
ఆ థియేటర్ కు ఇంకో నేపథ్యం ఉంటుంది. ఫస్ట్ సీన్లో నాజీల దాడిలో తన కుటుంబాన్ని కోల్పోయి అక్కడ నుంచి బయటపడిన అమ్మాయే ఆ థియేటర్ ను నిర్వహిస్తూ ఉంటుంది. అనాథగా రోడ్డున పడిన ఆమెను ఒక క్రిస్టియన్ కుటుంబం ఆదరించి ఉంటుంది. ఆమెకు పేరు మార్చి, ఆమె క్రిస్టియన్ అని నిరూపించడానికి కొన్ని ఆధారాలను ఇచ్చి ఉంటుంది. యూధు నేపథ్యాన్ని వదిలేసి ఆ అమ్మాయి క్రిస్టియన్ పేరుతో థియేటర్ నడుపుతుంటుంది. ఆ ఊరికి వచ్చిన నాజీలు ఆమె థియేటర్లోనే తమ సినిమా ప్రదర్శించాలని భావిస్తారు. నాజీలపై తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి అదే తగిన సమయం అని ఆమె మరో ప్రణాళికతో రెడీ అవుతుంది.
ఒక నాజీ సైనికాధికారి కమ్ జర్మన్ సినిమా హీరో ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. అతడు ఆమెను నాజీ ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్తాడు. జోసెప్ గొబెల్స్ ను పరిచయం చేస్తాడు. తన కుటుంబీకులను దారుణంగా హతమార్చిన నాజీ సైనికాధికారి ఒకడిని ఆమె అక్కడ చూస్తుంది. ప్రతీకారంతో రగిలిపోతుంది. అయితే అక్కడ రెచ్చిపోకుండా.. హిట్లర్ నే మట్టుబెట్టి తన పగ చల్లార్చుకోవడానికి ఆమె ఆత్మాహుతి దాడికి రెడీ అవుతుంది, దానికి తన థియేటర్ నే వేదికగా చేసుకుంటుంది.
సినిమా రీల్స్ ను భారీ ఎత్తున తెర వెనుకకు చేర్చి.. నాజీలు,వారి కుటుంబీకులంతా సినిమా వీక్షణలో మునిగి తేలుతున్న సమయంలో అవన్నీ ఒకేసారి భగ్గునమండేలా చేసి.. థియేటర్ లోనే హిట్లర్ తో సహా నాజీ ప్రముఖులను సజీవదహనం చేయడానికి ఆమె ప్లాన్ రెడీ చేసుకుంటుంది.
అటు ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ తమ ప్లాన్ తో ఆ థియేటర్ కు చేరతారు. ఈ అమ్మాయి అదే లక్ష్యంతో అంతా రెడీ చేసుకుంటుంది. వీరు ఒకరికి ఒకిరికి తెలీదు! హిట్లర్ రానే వస్తాడు. సినిమా ప్రదర్శన మొదలవుతుంది. ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ ను నాజీ అధికారి గుర్తిస్తాడు. ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా వారిని పట్టి తీసుకెళ్లిపోతాడు. వాళ్ల ప్లాన్ అలా విఫలం అయినా.. యూధు అమ్మాయి ఉన్నట్టుండి తెర మీదకు వస్తుంది.మరి కాసేపట్లో వాళ్లంతా మరణించబోతున్నారనే విషయాన్ని చెప్పి స్క్రీన్ మీద నుంచినే సెండాఫ్ ఇస్తుంది. తన సహచరుడి సాయంతో సినిమా రీల్స్ తో ఆమె థియేటర్ ను పేల్చేస్తుంది. ఆ ఆత్మాహుతి దాడిలో ఆమెతో పాటు హిట్లర్, గొబెల్స్ తో సహా నాజీ ప్రముఖులంతా అగ్నికి ఆహుతవుతారు.
ఆ రాత్రికే రెండో ప్రపంచయుద్ధం ముగుస్తుంది. తమను పట్టుకున్న నాజీ అధికారితో ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ రాజీకి వస్తారు. యుద్ధంలో అమెరికా- బ్రిటన్ లు గెలిచాయి కాబట్టి..తమకు సరెండర్ అయితే అతడిని క్షమించి వదిలేస్తామని వారు హామీ ఇస్తారు. తొలి సీన్లో యూధు కుటుంబాన్ని దారుణంగా హతమార్చింది ఆ నాజీనే. అతడు బాస్టర్డ్స్ తో రాజీ కుదుర్చుకుంటాడు. చివరకు మరో నాజీని చంపి అతడి స్కాల్ప్ ను తీసుకెళ్లడంతో ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ లక్ష్యం నెరవేరినట్టుగా సినిమాను ముగిస్తారు.
ఇందులో వాస్తవాలు ఏమిటంటే.. ఒకానొకప్పుడు సెకెండ్ వరల్డ్ వార్ జరిగింది, హిట్లర్ అనే నియంత ఉండేవాడు, యూధులపై అరాచకాలు జరిగాయి.. ఇది తప్ప ఈ సినిమా మొత్తం కల్పితమే.
అయితే చరిత్రపై ఒక కల్పిత కథను ఎంతో రోమాంచకంగా చెప్పడంలో టరంటినో ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే! తొలి సీన్లో అండర్ గ్రౌండ్లో దాగిన యూధు కుటుంబాన్ని చూపించే సన్నివేశంతో ప్రేక్షకుడిని నివ్వెరపరుస్తాడు ఈ దర్శకుడు. క్రిస్టియన్ ఐడెంటీటీతో నాజీల వద్దకు వెళ్లే యూధు అమ్మాయి ఎక్కడ వారికి దొరికి పోతుందో అనే టెన్షన్ ను క్రియేట్ చేస్తూ సాగే సీన్లు మునివేళ్ల మీద నిలబెడతాయి. ఒక్కో పాత్ర పరిచయంతోనూ సినిమాను ఒక రియలిస్టిక్ థ్రిల్లర్ గా మార్చే ప్రక్రియకు ఈ సినిమా ఒక డిక్షనరీ లాంటిదని చెప్పవచ్చు. ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ హెడ్ – అపాచే గా బ్రాడ్ పిట్ నటన ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది. రూత్ లెస్ నాజీ ఆఫీసర్ లండా గా క్రిస్టోఫ్ వాల్ట్జ్ క్రూరత్వాన్ని తన కళ్లతోనే ఆవిష్కరించాడు! అద్భుతమైన నటన, అంత కన్నా అద్బుతమైన నెరేషన్ తో ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది.
-జీవన్ రెడ్డి.బి