కీచక ఎస్ఐ గుట్టును బాధితురాలు రట్టు చేసింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ పోలీసు కామాంధుడి ఆగడాలు ఎట్టకేలకు బయటపడ్డాయి. ఎస్ఐ వాయిస్ రికార్డు బయటపడడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం రాపాక జంక్షన్ వద్ద బొడ్డేపల్లి మీనాక్షి అనే మహిళ కిరాణా దుకాణం నడుపుతోంది. అక్రమ మద్యం అమ్ముతున్నట్టు పోలీసులకు ఆమెపై ఫిర్యాదు అందింది. దీంతో ఆమె దుకాణంపై ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. మీనాక్షి దుకాణంలో 11 మద్యం సీసాలు దొరికాయి.
మద్యం సీసాలతో పాటు ఆమెను కూడా పోలీసులు స్టేషన్‌కు వెంటబెట్టుకెళ్లారు. మహిళని కూడా చూడకుండా ఆమెని ఒక రోజంతా పోలీస్‌స్టేషన్‌లోనే కూర్చోబెట్టారు. తనను విడిచిపెట్టాలని ఎస్ఐని మీనాక్షి వేడుకున్నది. అంతేకాదు, ఓ శుభకార్యం నిమిత్తం తెచ్చుకున్న సీసాలను పట్టుకుని తనపై కేసు పెట్టొద్దని ఆమె ప్రాథేయపడింది. అయితే మీనాక్షిపై కన్నుపడ్డ ఎస్ఐ…కేసు పెట్టకుండా ఉండాలంటే తన కోరిక తీర్చాలని కండీషన్ పెట్టాడు.
నువ్వంటే తనకెంతో ఇష్టమని, తన ఇంటికి రావాలని ఆమెను ఆదేశించాడు. అయితే తనది గౌరవప్రదమైన కుటుంబమని, తండ్రి, పిల్లలు ఉన్నారని, తాను ఎలాంటి తప్పు పని చేయలేదని మరోసారి ఆమె చెప్పుకున్నా…ప్రయోజనం లేకపోయింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఎస్ఐకి ఆమె వేడుకోళ్లు మార్పు తీసుకురాలేకపోయాయి.
అయితే అప్పుడు మాత్రం ఇంటికి పంపిన ఎస్ఐ…ఆ తర్వాత పదేపదే ఆమెకు ఫోన్లు చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన కామవాంఛ తీరిస్తే కేసు నుంచి తప్పిస్తానని, లేదంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసి జైలుకు పంపుతానని బెదిరింపులకు పాల్పడసాగాడు. ఈ నేపథ్యంలో బాధిత మహిళ ఎస్ఐ ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేసి ప్రపంచానికి తెలియజేయడంతో…కామాంధుడి గుట్టురట్టు అయింది. ఈ మేరకు ఎస్ఐ ఫోన్ వాయిస్ రికార్డింగ్‌లను బాధితురాలు మీడియాకు అందజేసింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.