కమల్ హాసన్ కు వివాదాలు కొత్త కాదు. ఊపిరి సలపని వివాదాలు ఎన్నింటినో చూశాడాయన. ఎంత పెద్ద వివాదం తలెత్తినా చెక్కుచెదరని నైజం ఆయనిది. విశ్వరూపం సినిమా టైమ్ లో తమిళనాడు థియేటర్ల యాజమాన్యాలన్నీ ఎదురుతిరిగినప్పటికీ వెనక్కు తగ్గలేదాయన. అలాంటి వ్యక్తికి తాజాగా మరో వివాదం ఎదురైంది.
అయితే గతంలోలా కమల్ దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, అప్పుడు కమల్ ఓ నటుడు మాత్రమే, కానీ ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు కూడా. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. ఇంతకీ వివాదం ఏంటో చూద్దాం..
శివ కార్తికేయన్ హీరోగా అమరన్ అనే సినిమా తెరకెక్కుతోంది. సోనీ పిక్చర్స్ తో కలిసి కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా టీజర్ రిలీజైంది. ఇందులో కశ్మీర్ ముస్లిం తెగను అభ్యంతరకరంగా చూపించారనే వాదన మొదలైంది. తమిళనాడు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాన్ని లేవనెత్తింది.
అమరన్ చిత్రం కశ్మీర్ ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని ఆరోపిస్తూ, కమల్ తో పాటు శివకార్తికేయన్ ను అరెస్ట్ చేయాలంటూ ఆ బృంద సభ్యులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదిప్పుడు కమల్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.
ఇది చాలా సున్నితమైన అంశం. మొండిగా వ్యవహరిస్తే కమల్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే ఈ అంశంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు కమల్. తాజా సమాచారం ప్రకారం, ఈ అంశంపై కమల్ స్వయంగా ప్రెస్ మీట్ నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరో 2 రోజులు చూసి, వివాదం మరింత ముదిరితే స్వయంగా కమల్ హాసన్ మీడియా ముందుకు రావాలని అనుకుంటున్నారట.