ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి విషయంలో వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు ఏం బాగాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పార్టీలో వుండాలని కోరుకున్నప్పటికీ, మీకో దండమని ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. త్వరలో వేమిరెడ్డి రాజ్యసభ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఆయనకు నెల్లూరు ఎంపీ సీటు ఆఫర్ చేశారు.
నెల్లూరు లోక్‌సభ బరి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే తనకు పార్టీలో అవమానాలు జరుగుతున్నాయని వేమిరెడ్డి, ఆయన భార్య ప్రశాంతి వైసీపీకి రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీకి ఇది పెద్ద దెబ్బే. పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచే నాయకుడు, రానున్న రోజుల్లో టీడీపీకి మద్దతుగా నిలుస్తారని అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు ఒంగోలు ఎంపీ సీటు ఇస్తే చాలు, పార్టీలోనే వుంటానని మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు. కానీ ఆయన్ను పక్కన పెట్టి, తిరుపతి జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని తీసుకెళ్లారు. మాగుంటకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వకూడదనే సీఎం జగన్ పట్టుదలకు కారణాలేంటో స్పష్టంగా తెలియదు. కానీ మంచి మనిషి, వివాద రహితుడనే పేరున్న మాగుంటను వద్దనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసీపీలో వుంటా…. కుయ్యోమొర్రో అని మాగుంట వేడుకుంటున్నా అధిష్టానం పెడచెవిన పెట్టడం ఆ పార్టీ శ్రేణులకు సైతం కోపం తెప్పిస్తోంది.
ఒంగోలులో ఇవాళ ఇంటి పట్టాల పంపిణీకి కనీసం స్థానిక ఎంపీ అనే గౌరవం కూడా లేకుండా మాగుంటను పిలవలేదనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా వుండవు. ఒకవేళ ఏదైనా కారణంతో ఎమ్మెల్యే లేదా ఎంపీకి టికెట్ ఇవ్వకూడదని అనుకుంటే, దానికో పద్ధతి వుంటుంది. అవమానించేలా వ్యవహరించకూడదు. అదేంటో గానీ, మాగుంట విషయంలో సీఎం జగన్, వైసీపీ పెద్దలు తీవ్రంగా అవమానించారన్న భావన కలిగిస్తున్నారు. ఇది వైసీపీకి లాభమా? నష్టమా? అనేది వారే ఆలోచించుకుంటే మంచిది.