కేవలం త్రిషపైనే ఎందుకీ బురద జల్లుడు..?

అదేంటో అన్నీ త్రిషకే అవుతున్నాయి. అది కూడా బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్నాయి. మొన్నటికిమొన్న మన్సూర్ అలీఖాన్. తాజాగా తమిళ రాజకీయ నాయకుడు రాజు. ఇప్పుడేమో రెమ్యూనరేషన్ పై రచ్చ. కేవలం త్రిష చుట్టూనే…

అదేంటో అన్నీ త్రిషకే అవుతున్నాయి. అది కూడా బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్నాయి. మొన్నటికిమొన్న మన్సూర్ అలీఖాన్. తాజాగా తమిళ రాజకీయ నాయకుడు రాజు. ఇప్పుడేమో రెమ్యూనరేషన్ పై రచ్చ. కేవలం త్రిష చుట్టూనే ఎందుకిలా జరుగుతోంది?

ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలుగు రాజకీయాల్లో స్టార్ అప్పీల్ తగ్గిపోయింది. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన పవన్ కల్యాణ్ నే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఆల్రెడీ ఓసారి ఓడించారు కూడా. కానీ తమిళనాట దీనికి భిన్నం. అక్కడింకా రాజకీయాల్లో స్టార్ హీరోలు, హీరోయిన్లను ఓకే చేస్తున్నారు జనం. మొన్నటివరకు రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై భారీగా చర్చ జరిగినా, తాజాగా విజయ్ రాజకీయాల్లోకి ఎంటరైనా అంతా స్టార్ పవర్. 

ఇలా పార్టీలు పెట్టడమే కాదు, ఇతర పార్టీలకు ప్రచారం చేసే నటీనటులకు కూడా మంచి క్రేజ్ ఉంది అక్కడ. ఫలానా రాజకీయ నాయకుడి తరఫున స్టార్ హీరోయిన్ వస్తుందంటే, అక్కడి జనం ఆసక్తిగా చూస్తారు. గుంపులు గుంపులుగా మీటింగ్స్ కు తరలివస్తారు. ఒక దశలో నమిత అలానే పాపులర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పుడిదంతా ఎందుకంటే, రాబోయే ఎన్నికల కోసం త్రిషను ప్రచారాస్త్రంగా వాడడానికి ప్రయత్నిస్తున్నారట కొంతమంది. ఆల్రెడీ ప్రాధమికంగా చర్చలు జరిగాయట. త్రిష నో చెప్పడంతో, ఆమెపై ఇలా ప్రచారం మొదలుపెట్టారనే కొత్త చర్చ తమిళనాట మొదలైంది.

ఏఐఏడీఎంకే మాజీ నేత రాజు చేసిన అత్యంత జుగుప్సాకర ప్రకటన ఈ కోవలోకే వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం త్రిష రెమ్యూనరేషన్ పై కూడా ఓ సెక్షన్ చర్చ మొదలుపెట్టింది. ఆమె 6 కోట్లు తీసుకుంటోందని, నిబంధనలకు విరుద్ధంగా విదేశాల్లో పెట్టుబడులు పెడుతోందనే దుష్ప్రచారం మొదలైంది. ఇదంతా త్రిషను తమ దారిలోకి తెచ్చుకునేందుకు ఓ వర్గం పనిగట్టుకొని చేస్తున్న ప్రయత్నంగా చెబుతున్నారు కొంతమంది. 

ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఎన్నికల ప్రచారంలో త్రిష అడుగుపెడితే, ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. సదరు పార్టీకి లేదా అభ్యర్థికి కూడా మంచి మైలేజీ. కానీ త్రిషకు ఇలాంటివాటిపై ఆసక్తి లేనట్టుంది. ఎందుకంటే, ఆమె ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. మరోసారి స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. ఆమె వ్యతిరేకించడం వల్లనే ఈ వివాదాలన్నీ పుట్టుకొస్తున్నాయని, రాబోయే రోజుల్లో త్రిషపై మరింత బురద జల్లుతారని అంటున్నారు. ఇంతకీ త్రిష కోసం ప్రయత్నిస్తున్న ఆ రాజకీయ పార్టీ ఏంటో..?.