Sundaram Master Review: మూవీ రివ్యూ: సుందరం మాస్టర్

చిత్రం: సుందరం మాస్టర్ రేటింగ్: 2/5 తారాగణం: వైవా హర్ష, దివ్య శ్రీపాద, హర్షవర్ధన్, భద్రం తదితరులు కెమెరా: దీపక్  ఎడిటింగ్: కార్తిక్ వున్నవ సంగీతం: శ్రీచరణ్ పాకాల నిర్మాతలు: రవితేజ, సుధీర్ కుమార్…

చిత్రం: సుందరం మాస్టర్
రేటింగ్: 2/5
తారాగణం:
వైవా హర్ష, దివ్య శ్రీపాద, హర్షవర్ధన్, భద్రం తదితరులు
కెమెరా: దీపక్ 
ఎడిటింగ్: కార్తిక్ వున్నవ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాతలు: రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు
దర్శకత్వం: కళ్యాణ్ సంతోష్
విడుదల: 23 ఫిబ్రవరి 2024

తనకంటూ ఉన్న ప్రత్యేకతలతో గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు వైవాహర్ష. ప్రతి హాస్యనటుడికి ఏదో ఒక రోజు హీరో వేషం కట్టే అవకశామొస్తుందని ఈ చిత్రంతో ఋజువయింది. పైగా దీనికి రవితేజ నిర్మాతల్లో ఒకరు. అది అదనపు ఆకర్షణ. ట్రైలర్ ని బట్టి ఇదేదో ఆద్యంతం నవ్వించే చిత్రమన్న అంచనా ఏర్పడింది. ఇంతకీ అసలు విషయమేంటో చూద్దాం. 

కథలోకి వెళ్తే ఉత్తారాంధ్రలో పాడేరు అనే కుగ్రామం. ఆ ఊరి జనానికి ఇంగ్లీష్ నేర్పమని ఒక సోషల్ టీచర్ ని పంపిస్తాడు ఆ ఏరియా ఎమ్మెల్యే. అతనే సుందరం మాస్టర్. ఈ పనికి సుందరమే ఎందుకు అంటే ఆ ఊరి జనం నల్లగా ఉన్నవాడినే ఇష్టపడతారు, నమ్ముతారు.

పాఠాలు చెప్పడమొకటే కాకుండా ఆ ఎమ్మెల్యే ఈ సుందరానికి మరొక పని కూడా అప్పజెప్తాడు. ఆర్నెలల్లో ఆ పనిని విజయవంతంగా చేసుకొస్తే జిల్లా విద్యాధికారిగా నియమిస్తానని చెప్తాడు.

ఇక ఆ పల్లెప్రజలకి ఇంగ్లీష్ రాయడం మాత్రమే రాదు. మాట్లాడడం అనర్గళంగా వచ్చు. ఎందుకంటే బ్రిటీష్ పాలనలో నేర్చుకున్నారు. వాళ్లకి బ్రిటీష్ వాళ్లు దేశం వదిలిపోయారని తెలీదు.

ఈ నేపథ్యంలో సుందరం మాస్టర్ తనకి వచ్చీ రాని ఇంగ్లీషుతో వాళ్లకి స్పెలింగులు ఎలా నేర్పిస్తాడు? ఎమ్మెల్యే చెప్పిన మరో పనిని ఎలా చేస్తాడు అనే దిశలో కథనం నడుస్తుంది.

కథని ఎలా అయినా ఊహించొచ్చు. ఎంత కాల్పనికంగా అయినా మలచుకోవచ్చు. కానీ దానికి తగ్గ నమ్మశక్యమైన కథనముండాలి.

ఈ రోజుల్లో బయటి ప్రపంచంతో అస్సలు సంబంధం లేని నాగరికులు నివశించే పల్లె ఉండడం సాధ్యమా?

ఇంకా గాంధీగారు స్వాతంత్రం కోసం పోరాడుతున్నాడన్నంత అవివేకంలో వాళ్లు ఉండడాన్ని నమ్మగలమా?

ఆ పల్లెవాసి ఒకడు గాంధీగారిని కలవాలనుకుంటాడు. ఎప్పటి గాంధీ, ఎక్కడ ప్రస్తుత కథ!

కనీసం ఆ లెక్కలు కూడా ఈ పల్లెజనానికి తెలియకపోవడం ఆశ్చర్యం. 

అప్పట్లో “యుగానికొక్కడు” (ఆయిరత్తిల్ ఒరువన్) అనే సినిమా వచ్చింది. అందులో ఒక రిమోట్ ఏరియాలో ఇంకా చోళుల-పాండ్యుల వారసులు నివశిస్తూ ఆ రాచరిక పాలనలో ఉంటూంటారు. వినడానికి వింతగా ఉన్నా చూసేవాళ్లకి ఆ రకమైన గగుర్పొడిచే యాంబియన్స్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసాడు సదరు దర్శకుడు. కానీ ఇక్కడ “సుందరం మాస్టర్” విషయంలో యాంబియన్సే సమస్య. ఆ పల్లెవాసులంతా చాలా మాడర్న్ గా ఉంటారు. కానీ బయటి ప్రపంచం తెలీదు!

ఈ సినిమా చూస్తుంటే హిందీ చిత్రం “న్యూటన్” గుర్తొస్తుంది. ఛత్తీస్‌గఢ్ లోని ఒక మారుమూల పల్లెకి డెప్యుటేషన్ మీద వచ్చిన ఒక ఆఫీసర్ కథ అది. అది నమ్మశక్యంగా ఉంటూ ప్రేక్షకుల్ని కథనంలోకి నడిపిస్తుంది. కానీ ఆ బ్యాలెన్స్ ఇక్కడ కొరవడింది. 

ఇంగ్లీష్ నేర్పేటప్పుడు స్పెలింగుల చుట్టూ రాసుకున్న కామెడీ బాగానే ఉన్నా, అది తప్ప ఇంకేమీ బాగోలేదు అనిపించేలా ఉంది. ప్రధానమైన మైనస్సల్లా అతికీ అతకని కథాకథనాలే. మొదటి నలభై నిమిషాలు సరదాగానే ఉంది. తర్వాత నెమ్మదిగా సరదా తీరుస్తుంది. 

వైవా హర్ష నటన మాత్రం పాత్రకి తగ్గట్టు ఎంతవరకు ఉండాలో అంతవరకు సరైన తూకంలో ఉంది. ఎక్కడా అతి చేయలేదు అలాగని తేలిపోలేదు. 

దివ్య శ్రీపాద పాత్ర కూడా పర్వాలేదు కానీ పెద్దగా హత్తుకోదు. ఆమె పాత్రని ఇంకాస్త బలంగా మలచి ఉంటే బాగుండేది. 

హర్షవర్ధన్ ది అతిధి పాత్రలాంటి క్యారెక్టర్. మొదట కాసేపు, చివర్లో కొంచెం సేపు కనిపించే ఎమ్మెల్యే..!

మిగిలిన నటులంతా దాదాపు కొత్తవాళ్లే. వాళ్లని తప్పుపట్టేందుకేం లేదు, గొప్పగా చెప్పుకోవడానికి కూడా లేదు. 

నేపథ్య సంగీతం కథానుగుణంగా సన్నివేశపరంగా బాగానే ఉంది. పాటల గురించి మాత్రం గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు.

పాజిటివ్ గా చెప్పుకోవాల్సిన అంశం కెమెరా వర్క్. దీపక్ యరగెర సినిమాటోగ్రఫీ వల్ల విజువల్ యాంబియన్స్ బాగుంది. 

నిర్మాణ విలువలు క్యాస్టింగ్ పరంగా పెద్దగా లేకపోయినా మేకింగ్ పరంగా ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉన్నాయి. 

మంచి ప్లాట్ పాయింటుని ఏదో చేయబోయి ఏదేదో చేసి చివరకి నిరాశపరిచేలా తీసిన చిత్రమిది. కొన్ని ఎపిసోడ్స్ లాజిక్ కి వందల కిలోమీటర్ల దూరంలో నడుస్తుంటాయి. 

ప్రధమార్ధంలో స్పెలింగుల పాఠం మినహాయిస్తే మిగిలిందంతా జోకొట్టే పాఠంలా సాగింది. ఎక్కడా చిన్న ఉత్కంఠ కానీ, ఉత్సాహం కానీ ఉండవు. ఏదో ఆశించి వెళ్లిన ప్రేక్షకులకి ఆశించిన ఫలితం దక్కదు. ఒకవేళ వెళ్లినా ప్రధామార్ధం చూసేసి వచ్చేసినా సరిపొతుందనేలా ఉంది. 

బాటం లైన్: మాస్టారు జోకొట్టారు