కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పరిస్థితి దయనీయంగా మారింది. ఇటు టీడీపీ, అటు వైసీపీ ఆయన్ను పట్టించుకోవడం లేదు. తన ఇంటికి వస్తామన్న వైసీపీ నేతల్ని రావద్దనడంతో ఆ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. పవన్‌కల్యాణ్‌ను నమ్ముకుని, ఇతర పార్టీలకు ఆయన దూరం అయ్యారు. ఎప్పుడో నెల క్రితమే ముద్రగడ ఇంటికి స్వయంగా పవన్‌కల్యాణే వెళ్లి. పార్టీలో చేర్చుకుంటారని తాడేపల్లిగూడెం జనసేన ఇన్‌చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే పవన్‌కల్యాణ్ మాత్రం ముద్రగడ ఇంటికి ఇప్పటి వరకు వెళ్లలేదు. బొలిశెట్టి చెప్పిన సమయం కూడా ఎప్పుడో దాటిపోయింది. అలాగని పవన్ ఏ నాయకుడి ఇంటికీ వెళ్లలేదా? అంటే… టీడీపీ నాయకుల ఇళ్లకు కూడా వెళ్లారు. విశాఖకు అదే పనిగా వెళ్లి కొణతాల రామకృష్ణను కలిశారు. ఇది ముద్రగడతో పాటు ఆయన అనుచరులకు తీవ్ర అవమానమైంది. దీంతో పవన్ వస్తే ఒక నమస్కారం, లేదంటే రెండు నమస్కారాలని సన్నిహితుల వద్ద అన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. పొత్తులు, ఇతరత్రా రాజకీయ కారణాల వల్ల పవన్ బిజీగా ఉన్నారని చెప్పారు. ముద్రగడ ఇంటికి త్వరలో పవన్ వస్తారని ఆయన తెలిపారు. జనసేనలో ఎలాంటి షరతులు లేకుండా ముద్రగడ చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పవన్‌కు అండగా నిలిచేందుకు ముద్రగడ రెడీగా ఉన్నారన్నారు.
మరోవైపు ముద్రగడను జనసేనలో చేర్చుకోవాలనే నిర్ణయంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జనసేనలో ముద్రగడ చేరికతో తమకు ఇతర సామాజిక వర్గాలు దూరమవుతాయని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. జనసేన, టీడీపీ కూటమిపై ప్రత్యర్థులు కాపు ముద్ర వేసి, రాజకీయంగా నష్టం కలిగిస్తారని ప్రధాన ప్రతిపక్ష నాయకులు భయపడుతున్నారు. ఏమవుతుందో చూడాలి.