ఏపీ కాంగ్రెస్లో కనీసం నెల రోజులు కూడా కొనసాగలేక, తిరిగి సొంత గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై షర్మిల కీలక కామెంట్స్ చేశారు. ఆర్కే తనకు దగ్గరి మనిషిగా ఆమె చెప్పుకొచ్చారు. వైఎస్సార్ తనయ షర్మిలతో పాటు నడిస్తానని ఎమ్మెల్యే పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆర్కే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆర్కే తిరిగి వైసీపీలో చేరడం షర్మిలకు గట్టి షాక్ ఇచ్చినట్టైందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.
ఈ నేపథ్యంలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయమని చెప్పే అవసరం తనకు లేదన్నారు. రాజకీయంగా కారణాలు లేకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలన్నారు. ఆర్కే అన్నతో తన అనుబంధం వేరన్నారు. తనకు చాలా దగ్గరి మనిషని అభిమానం చూపారు. ఆర్కేపై ఎన్ని ఒత్తిళ్లు వుంటే పార్టీ మారాడో తనకు తెలుసని ఆమె చెప్పుకొచ్చారు. ఆళ్ల చెల్లిగా అర్థం చేసుకోగలనన్నారు.
రామకృష్ణకు, తనకు మధ్య రాజకీయాలు లేవన్నారు. ఆర్కే ఎక్కడున్నా సంతోషంగా వుండాలని షర్మిల ఆకాంక్షించారు. మంచి వ్యక్తి రాంగ్ ప్లేస్లో ఉన్నారని షర్మిల వాపోవడం గమనార్హం. ఆర్కే విషయంలో షర్మిల స్పందన హుందాగా వుంది. కనీసం నెలరోజులు కూడా తన వెంట నడవలేదనే కోపంతో ఆర్కేపై షర్మిల నోరు జారకపోవడం విశేషం.
ఆర్కేపై షర్మిల నోరు పారేసుకునే అవకాశాలున్నాయని అంతా అనుకున్నారు. కానీ షర్మిల మాత్రం ఆళ్ల పరిస్థితిని అర్థం చేసుకోవాలనే ధోరణిలో మాట్లాడారు.