ఆ ప్రశ్నలు అడిగితే చరణ్-తారక్ ఊరుకుంటారా?

ఓ స్టార్ హీరో మీడియా ముందుకొస్తున్నాడంటే పీఆర్ టీమ్ హంగామా మామూలుగా ఉండదు. పొరపాటున ఏదైనా చిన్న వివాదాస్పద ప్రశ్న అడిగితే, ప్రెస్ మీట్ తర్వాత సదరు సినిమా జర్నలిస్ట్ పై ఓ రేంజ్…

ఓ స్టార్ హీరో మీడియా ముందుకొస్తున్నాడంటే పీఆర్ టీమ్ హంగామా మామూలుగా ఉండదు. పొరపాటున ఏదైనా చిన్న వివాదాస్పద ప్రశ్న అడిగితే, ప్రెస్ మీట్ తర్వాత సదరు సినిమా జర్నలిస్ట్ పై ఓ రేంజ్ లో మాటలు పడతాయి. అంతెందుకు.. ఆ హీరో నటించిన చిన్న ఫ్లాప్ సినిమా ప్రస్తావన తెచ్చినా చాలు, మనోభావాలు దెబ్బతినేస్తాయి. 

పుసుక్కున హర్ట్ అయిపోతారంతా. హీరో ఏం అనుకుండాడో అనే ఫీలింగ్ తో ముందుగానే పీఆర్ జనాలు రెచ్చిపోతుంటారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత నుంచి సదరు జర్నలిస్ట్ ను పీఆర్ జనాలు చూసే విధానం, ట్రీట్ చేసే పద్ధతి మారిపోతుంది. అందుకే ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు అడగడానికి పెద్దగా ఎవ్వరూ ముందుకురారు.

ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే, రీసెంట్ గా ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి ఓ హిందీ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ప్రశ్నలు అడిగిన వ్యక్తి ఏది అడక్కూడదో అదే అడిగాడు. ఎన్టీఆర్ ను శక్తి సినిమా గురించి అడిగాడు, శక్తిలో తారక్ చెప్పే డైలాగ్ అంటే ఇష్టమంటూ కౌంటర్లు వేశాడు. ఇక రామ్ చరణ్ ను పట్టుకొని ఓ ఆట ఆడుకున్నాడు.

జంజీర్ సినిమాను తన జీవితంలో అత్యంత ప్రశాంతంగా చూసిన సినిమాగా చెప్పుకొచ్చాడు సదరు యాంకర్. ఎందుకని రామ్ చరణ్ ప్రశ్నిస్తే.. సినిమా హాల్ మొత్తం ఖాళీగా ఉందని సమాధానం ఇచ్చాడు. నిజంగా ఇలాంటి ప్రశ్నలు తెలుగులో అడిగితే సమాధానాలు దొరుకుతాయా? పీఆర్ టీమ్స్ ఊరుకుంటాయా?

నిజానికి ఆ యూట్యూబ్ ఛానెల్ కాన్సెప్ట్ అది. కాస్త ఫన్నీగా, ఇంకాస్త ఎటకారంగా వీడియోలు చేయడం అతడి స్పెషాలిటీ. తన బ్రాండ్ కు తగ్గట్టు అతడు ప్రశ్నలు అడిగాడు, వీళ్లు తమకు తోచిన సమాధానాలు చెప్పారు. 

మరి అలాంటి కాన్సెప్ట్ తోనే తెలుగులో ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి, అవే ప్రశ్నలు రిపీట్ చేస్తే సమాధానాలు వస్తాయా? ఒకవేళ హీరోలకు చెప్పాలని ఉన్నా, పక్కనున్న జనాలు చెప్పనిస్తారా? అంతెందుకు, అసలు అలాంటి ఇంటర్వ్యూకు తెలుగులో ఓకే చెబుతారా?