జగన్ కేబినెట్ లో సమూలంగా మార్పులు జరగట్లేదు. ఒకరిద్దరు లేదా గరిష్టంగా ముగ్గురు… మంత్రులుగా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తారని స్వయానా జగనే క్లారిటీ ఇచ్చారు. మరి ఆ ముగ్గురు ఎవరు, వారిపై మిగతావారికి జలసీ ఉండదా.
అందుకే జగన్ పదే పదే బాధపడొద్దు, దిగులు పడొద్దు, మిమ్మల్ని పార్టీకి ఇంచార్జులుగా చేస్తున్నామని మిగతా వారిని బుజ్జగిస్తున్నారా..? ఇంతకీ ఎవరా ముగ్గురు..?
రెడ్డి, కమ్మ, కాపు..
మీడియా, సోషల్ మీడియా లెక్కల ప్రకారం పెద్దిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రెడ్డి, కమ్మ, కాపు సామాజిక వర్గాల నుంచి ముగ్గుర్ని మంత్రి వర్గంలోనే కొనసాగిస్తూ మిగతా సామాజిక వర్గాల్లో మిగిలినవారికి అవకాశాలివ్వబోతున్నారట సీఎం జగన్. అయితే కొనసాగేవారి లిస్ట్ పై అధికారిక సమాచారమేదీ లేదు.
కానీ ఎవరూ ఈ ప్రచారాన్ని ఖండించలేదు. ఆ ముగ్గురు నేతలు ఇటు మంత్రి పదవుల్లో ఉన్నా కూడా తమ తమ నియోజకవర్గాల్లో ఇంకా చెప్పాలంటే తమ జిల్లాల్లో పార్టీపై వారికి పూర్తి పట్టు ఉంది. అందుకే వారికి పార్టీ విషయాలు ప్రత్యేకంగా అప్పజెప్పకుండా పదవుల్లో కొనసాగిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.
పదవులు లేకపోతే అలుసైపోతారా..?
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత సహజంగానే పచ్చపాత మీడియా మంత్రి పదవులు కోల్పోయినవారిపై సింపతీ చూపిస్తుంది. అదే సమయంలో పరోక్షంగా వైరి వర్గం నుంచి కూడా సెటైర్లు మొదలవుతాయి. మొత్తం టీమ్ ని మార్చేస్తే ఏ గొడవా ఉండేది కాదు. కానీ ఒకరిద్దరు, లేదా ముగ్గురు కొత్త టీమ్ లో కూడా కొనసాగుతారు కాబట్టి సహజంగానే మిగతా వారికి కాస్త జలసీ ఉండొచ్చు. కానీ పార్టీపై పెత్తనం వస్తుంది కాబట్టి దాన్ని క్రమంగా మరచిపోవచ్చు. అందుకే జగన్ పదే పదే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నట్టు సమాచారం.
సమర్థత, పనితీరు ప్రకారం మంత్రి పదవుల్లో మార్పులు చేయట్లేదని, కేవలం సామాజిక సమీకరణాలు, అందరికీ అవకాశం ఇవ్వడం కోసమే ఈ పని చేస్తున్నానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో పదవులు కోల్పోయినవారి రియాక్షన్ ఎలా ఉంటుందో.. ఉగాది తర్వాతే తెలుస్తుంది. ఇలాంటి వారిలో కనీసం కొందరికైనా గాలం వేసేందుకు టీడీపీ రెడీగా ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే పదవి లేకపోయినా జగన్ వెంట నడిచేందుకు, పార్టీపై బాధ్యతతో జనాల్లోకి వెళ్లేందుకు మంత్రులంతా సిద్ధంగా ఉన్నారు. టీడీపీ పాచిక ఈ టైమ్ లో పారదు అనే చెప్పాలి. కానీ మంత్రి పదవిపై గట్టిగా నమ్మకం పెట్టుకుని, సెకండ్ లిస్ట్ లో కూడా పేరు లేనివారు మాత్రం అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. అలాంటివారు ఎంతమంది ఉన్నారు.. అసలు జగన్ లెక్కలేంటి అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.