సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్లకు పైగా గడువు వున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఊపందుకున్నాయి. పొత్తులు, సీట్ల వ్యవహారంపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఢీకొట్టేందుకు కొందరు జట్టు కడుతున్నారు.
ఎన్నికలతో సంబంధం లేకుండానే జట్టు కట్టిన బీజేపీ, జనసేన మాత్రం ….ఎన్నికలు సమీపించే సమయానికి విడిపోయేలా ఉన్నారు. పేరుకే మిత్రపక్షాలు తప్ప, ఎక్కడా కలిసి ముందుకు సాగుతున్న దాఖలాలు లేవు.
ఈ నేపథ్యంలో ప్రజాసమస్యలపై పాదయాత్ర నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఇవాళ ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రైతు సమస్యల పరిష్కారం కోసం త్వరలో పాదయాత్ర చేపడతామన్నారు.
రాష్ట్రంలో ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేదన్నారు. ప్రభుత్వ ఆలోచనతో రైతులు సతమతమవుతున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ, టీడీపీ కలిసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని సోము వీర్రాజు ఆరోపించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర సమస్యలపై కలిసి పోరాటం చేస్తామని గతంలో పొత్తు కుదుర్చుకున్న సందర్భంలో జనసేనాని పవన్‌కల్యాణ్, ఏపీ బీజేపీ నేతలు మీడియా సాక్షిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
కానీ జనసేనాని పవన్‌కల్యాణ్ ఎక్కడా బీజేపీ మాటే ఎత్తడం లేదు. ఇటీవల ఆవిర్భావ సభలో మాత్రం జగన్‌ను అధికారం నుంచి పడగొట్టేందుకు రోడ్ మ్యాప్ అడిగారు. రెండు నెలల క్రితమే తమకు అమిత్‌షా తిరుపతిలో రోడ్‌మ్యాప్ ఇచ్చారని సోము వీర్రాజు చెప్పారు.
తమను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా మ్యానిఫెస్టో కూడా ప్రకటించాడని, ఇతర పార్టీల పొత్తులపై కూడా సానుకూల ప్రకటన చేసిన పవన్‌పై బీజేపీ ఆగ్రహంగా ఉంది. పవన్ రాజకీయ పంథా చూస్తే… అతను తమ వెంట నడవరనే నిర్ణయానికి వచ్చి సొంతంగా బలపడేందుకు బీజేపీ దృష్టిసారించినట్టే కనిపిస్తోంది.