భారతదేశంలో హాలీవుడ్ భారీ పెట్టుబడులు

విదేశీ పెట్టుబడులు ఐటీ, టెక్నాలజీ రంగాల్లోనే కాదు, భారతీయ సినిమా రంగంలోకి కూడా వచ్చి పడబోతున్నాయి. Advertisement భారతీయ సినిమాలని ఆస్కారు వారు తమ తలుపును తట్టనిస్తున్నారు. తలుపు తీసి లోపలికి రమ్మంటున్నారు. ఆతిధ్యమిచ్చి…

విదేశీ పెట్టుబడులు ఐటీ, టెక్నాలజీ రంగాల్లోనే కాదు, భారతీయ సినిమా రంగంలోకి కూడా వచ్చి పడబోతున్నాయి.

భారతీయ సినిమాలని ఆస్కారు వారు తమ తలుపును తట్టనిస్తున్నారు. తలుపు తీసి లోపలికి రమ్మంటున్నారు. ఆతిధ్యమిచ్చి నామినేట్ చేస్తున్నారు. అవార్డులు కూడా ఇస్తున్నారు. 

అఫ్కోర్స్, ఇదంతా జరగడానికి ఆయా దర్శకనిర్మాతలు అమెరికన్ మీడియా మీద బాగా ఖర్చుపెట్టగలిగే స్థితిమంతులై ఉండాలి. భారతదేశ ప్రభుత్వం ఏదో సినిమాని తమవైపునుంచి నామినేట్ చేసిందని దానిని గుర్తించలేదు. దగ్గరుండి డబ్బులు ఖర్చుపెట్టుకుని నానా తిప్పలు పడిన ఆర్ ఆర్ ఆర్ నే పట్టించుకుంది ఆస్కార్ సంస్థ. 

అలాగని ఏదో అవార్డు ప్రకటించడం మాత్రమే కాదు. ఆస్కార్ వేదిక మీద కీరవాణి ప్రోగ్రాం, మన హీరోల డ్యాన్స్ ఉండబోతోంది. దీనికి తోడు ఆ ఆస్కార్ ఈవెంట్ కి ప్రెజెంటర్ గా మరొక భారతీయ నటి దీపిక పదుకోన్ ని కూడా నిలబెట్టారు ఆస్కార్ కమిటీ వారు. 

ఇదంతా చూస్తుంటే హాలీవుడ్ భారతీయ సినిమాని గుర్తించి గౌరవిస్తోందనిపిస్తుంది. కానీ ఈ గౌరవం వెనుక పెద్ద వ్యాపారం లక్ష్యం ఉంది.

అమెరికాలోని ఒక ప్రసిద్ధ సినిమా బ్యానెర్ కి చెందిన ఒక భారతీయుడు చెప్పిన విషయాల ప్రకారం హాలీవుడ్ కన్ను ఇండియన్ మార్కెట్ మీద పడింది. ఇనాళ్లూ ఇండియన్ మార్కెట్ అంకెలు హాలీవుడ్ ని పెద్దగా కదిలించలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. అంకెలు మారిపోయాయి. దానికి కారణాలు అనేకం. ముఖ్యంగా ఇండియాలో యూత్ జనభా ఎక్కువ. సినిమాలకి వాళ్లే ప్రధాన పోషకులు. భారీ సినిమాల్ని ఒళ్లుపోయి తెలీకుండా ఆదరిస్తున్నారు. బ్రహ్మాస్త్ర, పఠాన్ సినిమాలే దానికి తార్కాణాలు. 

ఇంతా చేసి హాల్వీవుడ్ స్థాయిలో చూస్తే ఆ సినిమాల మీద పెట్టుబడి తక్కువే. కానీ రాబడి ఎక్కువ. అదీ కేవలం ఇండియన్ ఆడియన్స్ ప్రపంచవ్యాప్తంగా చూస్తేనే ఆ రేంజులో కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. అదే హాలీవుడ్ స్థాయిలో అమెరికాలో కూడా ప్రచారం జరిగితే అది పాన్ వరల్డ్ సినిమా అయిపోతుంది. కనుక పలు హాలీవుడ్ బ్యానర్స్ ఇండియన్ సినిమాపై పెట్టుబడులకి ఆసక్తి చూపిస్తున్నాయి. 

అంతా బానే ఉంది. కానీ ఇక్కడే కాస్త ఆలోచించాలి. మన దేశ బ్యానర్స్ మీద తయారయ్యే సినిమాలు ఇక్కడే సంపాదిస్తాయి, ఆ సంపాదించిన దానిని సర్క్యులేట్ చేస్తాయి. కానీ విదేశీ బ్యానర్స్ సీన్లోకి వస్తే మన దేశ ధనం అమెరికాకు పోతుంది. అక్కడి పెట్టుబడి ఇక్కడ 100 రూపాయలైతే, ఇక్కడ రాబడి అక్కడికి పోయేది 1000 రూపాయలుండొచ్చు. 

ఈ విషయంలో మనం చైనా పద్ధతిని ఫాలో అవ్వాలి. చైనాలో ఏ విదేశీ చిత్రం విడుదలైనా వచ్చిన లాభంలో 10% మాత్రమే దేశాన్ని దాటించి తీసుకెళ్లగలదు. మిగతా 90% చైనాదే. అదే పద్ధతిని అవలంబించి, కావాలంటే మన దేశం 20% వరకు పట్టుకెళ్లమనొచ్చు. అంతే కానీ పూర్తిగా తెరిచి కూర్చుంటే తెలియకుండా బోలెడెంత బయటికి పోతుంటుంది. ఈ విషయంలో కేంద్రంలోని ఆర్ధిక నిపుణులు తల దూర్చి నియమాలు పెట్టాలి. 

ఇండియన్ సినిమాలని, దర్శకుల్ని గౌరవించడం, తద్వారా వారి వ్యాపారాన్ని ఇండియాలో విస్తరించుకోవడం ఇప్పుడు హాలీవుడ్ ఆలోచన. విదేశీ పెట్టుబడులు ఇండియన్ సినిమా రంగంలో కూడా వచ్చి పడబోతున్నాయని ఆనందించడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకుని దేశ ఆర్ధిక పరిపుష్టికి దారులు వేయాలి. 

హాలీవుడ్ కి చైనా మర్కెట్ లాభంలో 10% మాత్రమే ఇచ్చినా అది చాలా పెద్దది. ఇప్పుడు ఇండియా జనాభాలో చైనాని తలదన్ని నిలబడుతోంది. కనుక 20% ఇచ్చినా కళ్లకద్దుకుని భారతీయ సినిమా ప్రేక్షకుల కాళ్లకి దండం పెడుతుంది హాలీవుడ్. అలా మన చేయి పెట్టే స్థాయిలో పైన ఉంది.  ఆ విషయం మరిచిపోకూడదు. విదేశీయులకి దాసోహమని పూర్తిగా ముట్టజెప్పకూడదు. అదీ లెక్క.

శ్రీనివాసమూర్తి