ఆక‌ట్టుకునే ప్ర‌యోగం.. ది క్యూరియ‌స్ కేస్ ఆఫ్ బెంజమ‌న్ బ‌ట‌న్

'టైమ్ ఈజ్ ఏన్ ఇల్యూజ‌న్..' అన్నాడు.. ప్ర‌ఖ్యాత శాస్త్ర‌వేత్త ఆల్బ‌ర్ట్ ఐన్ స్టీన్. కాలం అనేది ఒక భ్ర‌మ అని ఆ మేధావి అభిప్రాయ‌ప‌డ్డాడు. మ‌రి కాలం అనేది నిజంగా భ్ర‌మ మాత్ర‌మేనా?  వారాలు,…

'టైమ్ ఈజ్ ఏన్ ఇల్యూజ‌న్..' అన్నాడు.. ప్ర‌ఖ్యాత శాస్త్ర‌వేత్త ఆల్బ‌ర్ట్ ఐన్ స్టీన్. కాలం అనేది ఒక భ్ర‌మ అని ఆ మేధావి అభిప్రాయ‌ప‌డ్డాడు. మ‌రి కాలం అనేది నిజంగా భ్ర‌మ మాత్ర‌మేనా?  వారాలు, నెల‌లు, మ‌నం లెక్కేసుకుంటున్న సంవ‌త్స‌రాలు.. ఇవ‌న్నీ మిథ్యేనా? మ‌నిషి భ‌విష్య‌త్తులోకి కాలాన్ని మించిన వేగంతో ప్ర‌యాణించ‌గ‌ల‌డా? అలాగే గ‌తంలో గ‌డిచిపోయిన రోజుల్లో  మ‌ళ్లీ త‌న‌ను తాను చూసుకోగ‌ల‌డా? అనే అంశాల గురించి భౌతిక శాస్త్ర ప‌రిశోధ‌కులే స్ప‌ష్ట‌మైన స‌మాధానాలు ఇవ్వ‌లేదు! .

ఏమో.. అది సాధ్య‌మేనేమో అనే సందేహాన్ని వారు అలాగే ఉంచారు! అసాధ్యం అని ఒక్క మాట‌తో తేల్చేయ‌డం అంటే అందుకు సంబంధించిన ప్ర‌య‌త్నాల‌ను మానేయ‌డమే. అయితే త‌ర్కం దాన్ని అలా వ‌దిలేయ‌లేదు. ప‌రిశోధ‌న‌లు సాగుతూ ఉంటాయి.

టైమ్ గురించి భౌతిక శాస్త్ర ప‌రిశోధ‌న‌లు అలా ఉంటే.. సినిమా వాళ్లు మాత్రం కాలంతో ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తూ ఉంటారు. త‌మ క‌థ‌లతో వారు కాలంలో వెన‌క్కూ, ముందుకూ ప్ర‌యాణిస్తూ ఉంటారు. కాస్త లాజిక్, మ‌రి కాస్త డ్రామాతో కాలంలో వెన‌క్కు ప్ర‌యాణించ‌డం, ముందుకు వెళ్ల‌డం అనే కాన్సెప్ట్ లో బోలెడ‌న్ని సినిమాలు వ‌చ్చాయి. 

తెలుగు సినిమా మేక‌ర్లు ఇలాంటి ప్ర‌యోగాల‌తో విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను రూపొందించారు. టైమ్ మిషెన్ కాన్సెప్ట్ తో వ‌చ్చిన సినిమాతో పాటు.. కొన్నేళ్ల కింద‌టే 24 అనే త‌మిళ అనువాద సినిమా కూడా కాలం విష‌యంలో ప్ర‌యోగాత్మ‌క సినిమానే.

24 సినిమాలో హీరో చేతిలే ఉండే వాచ్ కాలాన్ని వెన‌క్కు తీసుకెళ్ల‌గ‌ల‌దు, ముందేం జ‌రుగుతుందో తెలుసుకునేలా చేయ‌గ‌ల‌దు.  విక్ర‌మ్ కే కుమార్ కు ఈ ఐడియా ఎలా వ‌చ్చిందో కానీ, ఒక వ్య‌క్తి రూపొందించిన వాచ్ అత‌డి జీవితాన్ని అనూహ్యంగా ప్ర‌భావితం చేసే సినిమా హాలీవుడ్ లో 24 క‌న్నా ముందే ఒక‌టి వ‌చ్చింది. అదే 'ది క్యూరియ‌స్ కేస్ ఆఫ్ బెంజమ‌న్ బ‌ట‌న్'

24 సినిమాలో హీరో రూపొందించిన వాచ్ కాలాన్ని స్తంభింప‌జేయ‌గ‌ల‌దు, ఆ వాచ్ క‌ట్టుకున్న వ్య‌క్తికి మాత్ర‌మే అర్థ‌మ‌య్యేలా గతాన్ని, భ‌విష్య‌త్తును అనుభ‌వంలోకి తీసుకురాగ‌ల‌దు. కాలంలో ప్ర‌యాణించ‌గ‌ల ఆ వాచ్ కు సంబంధించి లాజిక్ ఏమీ ఉండదు. ఆ సినిమాను హిట్ చేసిన ప్రేక్ష‌కులు కూడా ఒక వాచ్ లో ముళ్లు తిప్పితే కాలం మొత్తం ఎలా వెన‌క్కూ ముందుకూ వెళ్ల‌గ‌ల‌దు అనే లాజిక్ ను ప‌ట్టించుకోలేదు.

హాలీవుడ్ లో 24 క‌న్నా కొన్నేళ్ల ముందే వ‌చ్చిన ది క్యూరియ‌స్ కేస్ ఆఫ్ బెంజమ‌న్ బ‌ట‌న్ లో కూడా ఒక వ్య‌క్తి ఒక వాచ్ రూపొందిస్తాడు. అయితే అది  అప‌స‌వ్య ద‌శ‌లో తిరుగుతూ ఉంటుంది. 

నిమిషాల ముళ్లు వెన‌క్కు తిరుగుతూ ఉంటుంది, దాంతో పాటు గంటల ముళ్లు కూడా, ఆ వాచ్ లో డేట్లు కూడా వెన‌క్కు వెళ్లిపోతూ ఉంటాయి. అది అంద‌రి జీవితాల‌నూ ప్ర‌భావితం చేయ‌దు కానీ, దాన్ని రూపొందించిన వ్య‌క్తి జీవిత‌మే రివ‌ర్స్ లో సాగుతుంది, అది కూడా అత‌డి పున‌ర్జ‌న్మ‌లో. ఆ ప‌రిస్థితుల్లో అత‌డు ఎదుర్కొన్న అనుభ‌వాల సార‌మే ఈ సినిమా.

మొద‌టి ప్ర‌పంచ యుద్ధంలో అమెరికా ఎంతో సైన్యాన్ని కోల్పోతుంది. ఆ యుద్ధంలో దేశం త‌ర‌ఫున‌ పోరాడ‌టానికి త‌న త‌న‌యుడిని పంపించిన ఒక వ్య‌క్తి.. ఆ కుర్రాడు యుద్ధ‌భూమిలోనే ప్రాణాలు కోల్పోవ‌డంతో తీవ్ర వేధ‌న‌కు గుర‌వుతాడు. వాచ్ మేక‌ర్ అయిన ఆ వ్య‌క్తి త‌న‌తో పాటు యుద్ధంలో కొడుకుల‌ను కోల్పోయిన తల్లిదండ్రులంద‌రి జ్ఞాప‌కంగా ఒక వాచ్ ను రూపొందిస్తాడు. ఆ వాచ్ అప‌స‌వ్య దిశ‌లో సాగుతుంటుంది. 

రోజులు వెన‌క్కు వెళ్లాల‌ని, అప్పుడు అమెరికా త‌ను కోల్పోయిన కొడుకుల‌ను తిరిగి పొందుతుంద‌నే వేదాంతాన్ని త‌న వాచ్ తో ప్ర‌ద‌ర్శిస్తాడు వాచ్ మేక‌ర్. దాన్ని న్యూయార్క్ ట్రైన్ స్టేష‌న్ లో వేలాడ‌దీస్తారు. మొద‌టి ప్ర‌పంచ యుద్ధంలో ప్రాణాల‌ను కోల్పోయిన సైనికులకు నివాళిగా దాన్ని భావిస్తుంది అమెరికా. ఆ వాచ్ ను త‌యారు చేసిన వ్య‌క్తి.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ  ఎవ‌రికీ క‌నిపించ‌డు. అత‌డు స‌ముద్రం మీద‌కు ప‌డ‌వ‌లో వెళ్లి అక్క‌డే చ‌నిపోయాడ‌ని అంతా భావిస్తారు.

అత‌డు చ‌నిపోయిన రాత్రే.. అదే అమెరికాలో బ‌ట‌న్స్ ఫ్యామిలీలో ఒక పిల్లాడు పుడ‌తాడు. చూడ‌టానికి అష్టావ‌క్రుడిలా  ఉంటాడు ఆ చిన్నారి. వింత‌గా ఉన్న ఆ పిల్లాడిని చూసి అత‌డి తండ్రే త‌ట్టుకోలేక‌పోతాడు. వింత శిశువును తీసుకెళ్లి బ‌య‌ట వ‌దిలేసి వ‌స్తాడు. 

ఆ పిల్లాడిని ఒక న‌ల్లజాతి మ‌హిళ తీసుకోవ‌డాన్ని అత‌డు గ‌మనించి ఇంటికి వెళ్లిపోతాడు. పిల్లాడిని క‌న్న త‌ల్లి ఆ బాధ‌లోనే క‌న్నుమూస్తుంది. వింత‌గా ఉండ‌టంతో ఆ శిశువును ఎవ‌రో వ‌దిలేసి వెళ్లార‌ని అర్థం చేసుకున్న‌ న‌ల్ల‌జాతి మ‌హిళ అత‌డిని వ‌దిలించుకోలేక చేర‌దీస్తుంది. త‌న కొడుకులా చూసుకుంటుంది.

ప‌సిపిల్లాడే.. కానీ, 80 యేళ్ల వృద్ధుడి రూపురేఖ‌లు! ముడ‌త‌లు ప‌డ్డ చ‌ర్మం, పాలిపోయిన రూపం, అచ్చంగా వృద్ధుడే. కానీ వ‌య‌సులో ప‌సివాడు. రోజులు గ‌డుస్తూ ఉంటాయి.. పిల్లాడు పెద్ద‌వాడు అవుతూ ఉంటాడు. అత‌డిలోని వృద్ధుడి రూపం మ‌రింత స్ప‌ష్టంగా బ‌య‌ట‌ప‌డుతూ ఉంటుంది. గేలి చేసే వాళ్లు, ఏడిపించే వాళ్లు, త‌క్కువ చేసి చూసే వాళ్లు.. సానుభూతి చూపే వాళ్లు.. వీరంద‌రి మ‌ధ్య‌నా ఆ పిల్లాడు పెరుగుతూ ఉంటాడు. 

న‌ల్ల‌జాతి మ‌హిళ  త‌న త‌ల్లి కాద‌ని అత‌డికి అర్థ‌మ‌వుతుంది. త‌న రూపాన్ని చూసి భ‌య‌ప‌డి త‌న‌ను క‌న్న‌వారు వ‌దిలించుకున్నార‌నీ తెలుస్తుంది. ఏడెనిమిదేళ్ల వ‌య‌సుకు వ‌చ్చేస‌రికి 70 యేళ్ల రూపురేఖ‌లు, ఎత్తు మాత్రం చిన్న‌పిల్లాడిలానే ఉంటాడు.

టీనేజ్ లోనే బ‌ట్ట‌త‌ల‌, కాస్త వంగిన న‌డుము, ముడ‌త‌లు పోని చ‌ర్మం.. కానీ.. పుట్టిన‌ప్ప‌టితో పోలిస్తే కొంత మార్పు. యంగ్ ఏజ్ దిశ‌గా ప‌య‌నిస్తున్నాడు. పుట్టిన‌ప్పుడు 80 యేళ్ల వ‌య‌సులాంటి చ‌ర్మం. 20 యేళ్లు వ‌చ్చేస‌రికి 60 యేళ్ల వ్య‌క్తి తీరున రూపురేఖ‌లు. ఈ క్ర‌మంలో త‌ను వ‌య‌సు విష‌యంలో వెన‌క్కు ప‌య‌నిస్తున్న విష‌యం బెంజిమ‌న్ కు అర్థం అవుతుంది.

ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఒక చిన్న సైజ్ షిప్పులో అవ‌కాశం ల‌భిస్తుంది. పెంచిన త‌ల్లి నుంచి వీడ్కోలు తీసుకుని ఆ ప‌నికి వెళ‌తాడు. ఈ 20 యేళ్ల కుర్రాడిని ఓల్డ్ మ‌న్ గా ట్రీట్ చేస్తూనే ప‌ని క‌ల్పిస్తారు. 30 యేళ్లు వ‌చ్చేస‌రికే మ‌ధ్య వ‌య‌సు వ్య‌క్తిలా మారిపోతాడు. ఆ స‌మ‌యంలో ఒక మ‌ధ్య‌వ‌య‌సు స్త్రీతో పరిచ‌యం ఏర్ప‌డుతుంది. శారీర‌క సంబంధం ఏర్ప‌డుతుంది. రెండో ప్ర‌పంచ యుద్ధం స‌మ‌యం వ‌స్తుంది. అందులో పాల్గొంటాడు బెంజమ‌న్.

రోజులు గ‌డిచే కొద్దీ త‌న ముస‌లిత‌నం పోతూ, నూత‌న య‌వ్వ‌న్నాన్ని అందుకుంటూ ఉంటాడు. బాల్యం నుంచి వృద్ధాప్యం వైపు మ‌నుషులంతా ప‌య‌నిస్తే బెంజమ‌న్ మాత్రం వృద్ధాప్యం నుంచి య‌వ్వ‌నం వైపు సాగుతుంటాడు. త‌న చిన్న‌నాటి స్నేహితురాలు ఒక అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమెకూ ఇతడంటే ప్రేమే. కానీ డ్యాన్స్ అంటే విప‌రీత అభిమానంతో ఆమె బెంజమ‌న్ ను వ‌దిలేసి వెళ్లిపోతుంది. 

కొన్నేళ్ల‌కు తిరిగి వ‌స్తుంది. ఆమె బాల్యం నుంచి వృద్ధాప్యం వైపు ప‌య‌నిస్తూ ఏ వ‌య‌సులో ఉంటుందో, బెంజమ‌న్ వృద్ధాప్యం నుంచి బాల్యం వైపు  వ‌స్తూ అదే వ‌య‌సులో ఉంటాడు. ఈ ఇద్ద‌రి మ‌న‌సులు క‌లుస్తాయి. పెళ్లి చేసుకుంటారు. రోజులు, నెల‌లు త‌ర‌బ‌డి మ‌రో ప‌ని లేకుండా త‌నివీతీరా శృంగారాన్ని ఆస్వాధిస్తారు.

పుట్టిన‌ప్పుడు బెంజమ‌న్ ను వ‌దిలించుకున్న తండ్రి మ‌ళ్లీ వ‌చ్చి ప‌ల‌క‌రిస్తాడు. జ‌రిగిన‌ది చెప్పి, త‌న ఆస్తినంతా రాసిస్తాడు. పెంపుడు త‌ల్లిపై మ‌మ‌కారం పోని బెంజమ‌న్, క‌న్న‌తండ్రిని కూడా వృద్ధాప్యంలో జాగ్ర‌త్త‌గా చూసుకుంటాడు.

మ‌రోవైపు భార్య ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు మొద‌లువుతుంది అత‌డి అస‌లు స‌మ‌స్య‌. పిల్ల‌లు త‌న‌లాగా పుడితే? అనే సందేహంతో స‌త‌మ‌త‌మవుతాడు. ఆరోగ్య‌వంత‌మైన అమ్మాయి పుడుతుంది. కానీ.. అతి త్వ‌ర‌లోనే త‌ను కుటుంబానికి భారం కాబోతున్న విష‌యం అత‌డికి అర్థం అవుతుంది. త‌ను వ‌య‌సులో చిన్నవాడు అయిపోతున్నాడు. 

నెక్ట్స్ టీనేజ్, ఆపై బాల్యం! త‌న భార్య పిల్ల‌ల‌ను చూసుకుంటుందా, త‌న‌ను పిల్లాడిగా ఆడిస్తుందా.. అనే సందేహంతో ఆమెను విడిచి పెట్టి వెళ్ల‌డానికి రెడీ అవుతాడు. ఆమె ఎంత చెప్పినా క‌న్వీన్స్ కాడు. ఆస్తుల‌న్నీ అమ్మేసి భార్యా, కూతురు పేరిట రాసి ఇండియా వ‌స్తాడు. కొన్నాళ్లు ఇక్క‌డ గ‌డుపుతాడు. మ‌ళ్లీ భార్యాపిల్ల‌లు గుర్తుకు రావ‌డంతో.. అమెరికా వెళ్లి వారిని దూరం నుంచి చూస్తూ గ‌డుపుతుంటాడు. 

భార్యను వేరే పెళ్లి చేసుకోమ‌ని సూచిస్తాడు. ఆమె ఆ ప‌నే చేస్తుంది, తన కూతురుకు ఒక తండ్రిని చూసుకుంటుంది. త‌న భార్యా, కూతురి బాధ్య‌త‌లు తీరాయ‌ని బెంజమ‌న్ సంతోషిస్తాడు. వ‌య‌సు పెరిగే కొద్దీ అత‌డు బాలుడైపోతాడు. గ‌తాన్ని క్ర‌మంగా మ‌రిచిపోతాడు. ఐదారేళ్ల వ‌య‌సు బాలుడ‌య్యే స‌రికి త‌న భార్య‌, కూతురును కూడా మ‌రిచిపోతాడు. భార్య మాత్రం ఇత‌డిని గుర్తు ప‌ట్టి చేర‌దీస్తుంది. 

అప్పుడు వైద్యులు ఇత‌డిని ప‌రిశోధిస్తారు. ఏదో అరుదైన జ‌బ్బు అంటారు. క్ర‌మంగా ప‌సి పిల్ల‌వాడు అయిపోయే బెంజమ‌న్ నెల‌ల పిల్లాడిగా భార్య ఒడిలోనే శాశ్వ‌త నిద్ర‌లోకి జారుకోవ‌డం, న్యూయార్క్ ట్రైన్ స్టేష‌న్ లో అప‌స‌వ్య దిశ‌లో సాగే వాచ్ ను తొల‌గించ‌డంతో సినిమా ముగుస్తుంది.

సినిమా మొత్తాన్నీ అత‌డు రాసిన డైరీగా కొంత‌, అత‌డి గురించి కూతురికి అత‌డి భార్య చెప్పే గ‌తంగా సాగుతుంది. ఒక భిన్న‌మైన ప్ర‌యోగం ఇది. మ‌నిషి జీవితం రివ‌ర్స్ లో సాగితే అత‌డి పరిస్థితి ఏమిటి అనేది చూపించే ప్ర‌య‌త్నం. అయితే సినిమా చాలా వ‌ర‌కూ పైపైనే సాగుతుంది. ఒక ర‌కంగా చెప్పాలంటే.. నిజంగానే ఇలాంటి స‌మస్య‌ను ఒక మ‌నిషి ఎవ‌రైనా ఎదుర్కొంటే..అత‌డి ప‌రిస్థితి ఏమిటి? అనే సంఘ‌ర్ష‌ణ‌ను స్ప‌ష్టంగా చూప‌లేదు.

త‌ను వ‌య‌సు విష‌యంలో రివ‌ర్స్ లో వెళ్తున్న‌ట్టుగా అర్థం చేసుకునే బెంజమ‌న్ అస‌లు అదెందుకు జ‌రుగుతోంది? అనే ప్ర‌శ్న‌ను ఎక్క‌డా వేసుకోడు! అత‌డితో పాటు ఉండే వాళ్లు, అత‌డి పెంపుడు త‌ల్లి, భార్య వీళ్లంతా కూడా.. అత‌డు వ‌య‌సు విష‌యంలో రివ‌ర్స్ లో వెళ్ల‌డం చాలా స‌హ‌జం అన్న‌ట్టుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. 

అత‌డి స‌మ‌స్య‌కు కార‌ణం ఏమిట‌నే అంశం గురించి సినిమాలో ఏ ఒక్క‌రూ శోధించ‌రు! అలాగే రివ‌ర్స్ లో సాగే వాచ్ ను బెంజమ‌న్  గ‌త జ‌న్మ‌లో త‌యారు చేశాడ‌ని సూఛాయ‌గా అర్థం అవుతుంది. గ‌త జ‌న్మ‌, వాచ్.. సినిమా సాగే తీరు.. ఇదంతా కొంచెం  అతుకుల బొంత‌లా అగుపిస్తుంది. ఇలాంటి పంటి కింది రాళ్లు ఎన్ని ఉన్నా, క‌థ చెప్పే విధానంలో డెప్త్ జోలికే వెళ్ల‌కుండా.. పైపేనే క‌థ చెప్పుకు వ‌చ్చినా.. సినిమా ఆసాంతం ఆక‌ట్టుకుంటుంది. 

ఎక్క‌డ బోర్ కొట్ట‌కుండా.. ఒక భిన్న‌మైన ప్ర‌యోగంగా అల‌రిస్తుంది ది క్యూరియ‌స్ కేస్ ఆఫ్ బెంజమ‌న్ బ‌ట‌న్. టైటిల్ రోల్ లో బ్రాడ్ పిట్ అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. సినిమాను ఒంటి చేత్తో న‌డిపించాడు. 

-జీవ‌న్ రెడ్డి.బి