దిల్ రాజు నిర్మిస్తున్న తమిళ సూపర్ స్టార్ విజయ్ తో నిర్మిస్తున్న సినిమా ‘వారసుడు’. ఎంత తమిళ సినిమా అయినా తెలుగులో కూడా విజయ్ పాపులర్ కనుక ఇది మాంచి హిట్ సినిమా అవుతుంది అనుకున్నారంతా. వంశీ పైడిపల్లి దర్శకుడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. తమిళ సూపర్ స్టార్ కనుక వందల కోట్ల బిజినెస్ చేసుకున్నారు. లాభాలు బాగానే వుంటాయి. కానీ తెలుగులో మాత్రం బడా సినిమాల ఇరుకున పడి నలిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
సంక్రాంతికి ఈ సినిమా విడుదల అని దిల్ రాజు ఎప్పుడో రుమాలు వేసుకున్నారు. ప్రభాస్ ఆదిపురుష్ కూడా ప్రకటించారు. సరే రెండు సినిమాలే అనుకుంటే ఇప్పుడు నాలుగు అవుతున్నాయని బోగట్టా. మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య, బాలయ్య బాబు ‘వీరసింహారెడ్డి’ కూడా సంక్రాంతికే విడుదల అని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే చాలా కష్టం అవుతుంది.
ఎందుకంటే నాలుగు సినిమాలు కూడా నిర్మాత దిల్ రాజు నైజాంలో చూసుకోవాలి. రెండు సినిమాలు విశాఖ ఏరియాలో చూసుకోవాలి. థియేటర్ల తలకాయ నొప్పి వుంటుంది. కానీ అది కాదు అసలు సమస్య. తెలుగులో వారసుడు ఓపెనింగ్ కు గట్టి దెబ్బ పడుతుంది. ఎంత కాదన్నా మన సినిమాలు ముందు చూడాలనుకుంటారు మన ప్రేక్షకులు. వాటి తరువాతే విజయ్ వారసుడికి ఓటేస్తారు.
బాగుంటే మిగిలిన వాటితో పాటు పండగ రన్ సహకరిస్తుంది. లేదూ ఏ మాత్రం వెనుకబడినా తెలుగులో దెబ్బయిపోతుంది. అలా అని ఇప్పుడు వాయిదా వేయలేరు. ఎందుకంటే తమిళులకు సంక్రాంతి కీలకమైన పండగ. అందువల్ల విజయ్ సినిమా విడుదల అక్కడ కీలకం. అంతే మరి ఒక ఊరు రాజు మరో ఊరు బంటు అనుకోవాల్సిందే.