ఊహించని విధంగా బాలయ్య సినిమాపై పుకార్లు ఊపందుకున్నాయి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా ఓ అనధికారిక రీమేక్ అనేది ప్రస్తుతం నడుస్తున్న రూమర్.
19 ఏళ్ల కిందట స్వామి అనే సినిమా వచ్చింది. హరికృష్ణ అందులో హీరో. ఆ సినిమా స్ఫూర్తితోనే భగవంత్ కేసరి సినిమాను తెరకెక్కిస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇలా పుకార్లు వచ్చిన వెంటనే యూనిట్ స్పందించింది. తమది స్ట్రయిట్ మూవీ అని క్లారిటీ ఇచ్చింది.
అసలే రీమేక్ ప్రాజెక్టులపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న రోజులివి. భోళాశంకర్ తో ఈ నిరసన మరింత ఎత్తుకు చేరింది. ఇలాంటి టైమ్ లో భగవంత్ కేసరి కూడా రీమేక్ అనే ప్రచారం మొదలయ్యేసరికి నందమూరి ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. నిర్మాతలు క్లారిటీ ఇవ్వడంతో కుదుటపడ్డారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలకృష్ణ కూతురు వరుస పాత్రలో శ్రీలీల కనిపించనుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు. తాజాగా సినిమాకు సంబంధించి తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశాడు రాంపాల్. దసరా కానుకగా థియేటర్లలోకి వస్తోంది భగవంత్ కేసరి.