''…ప్రాణం..నా ప్రాణం..నీతో ఇలా
గానం..తొలిగానం..పాడేవేళ..
తారా తీరం..కాంతులే కురిసేనా
మనదారిలో చాలా దూరం..
రాబోవు ఉదయాలనే విరిసేనా…''
ఇలా సాగే పాట, రాబోయే జాను సినిమాలోది. శర్వానంద్-సమంతల కాంబినేషన్ లో తమిళ సినిమా 96కు తెలుగు రీమేక్ గా వస్తోందీ సినిమా.
ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు లేదా భావావేశ ప్రేమాత్మక చిత్రాలకు సంగీతమే కీలకం. గోవింద వసంత..ఈ పేరు తెలుగుప్రేక్షకులకు పరిచయం అంతగా వుండకపోవచ్చు. కానీ మాంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చి 96 అనే సినిమా సక్సెస్ లో పాలు పంచుకున్న మ్యూజిక్ డైరక్టర్. తమిళ, మళయాల ప్రేక్షకులకు పరిచయమైన ఈ పేరు ఇప్పుడు తెలుగు వారికి కూడా పరిచయం కాబోతోంది.
శ్రీమణి రాసిన 'ప్రాణం..ప్రాణం' అంటూ సాగే ఈపాటను ఆన్ లైన్ లో విడుదల చేసారు. 96 సినిమా గురించి ఇప్పటికే చాలా వరకు తెలుగు ప్రేక్షకులకు కూడా కొంత తెలుసు. ఆ తెలిసిన మేరకు, ఆ సినిమా ఎలా వుండబోతోందో ఊహిస్తున్న మేరకు, అంచనాల వుండేలాగానే ఈ పాట కూడా వుంది. వినగా వినగా కొన్నాళ్ల పాటు ప్రేమికుల సాంగ్స్ లిస్ట్ లో ఫస్ట్ న వుండేలా రూపొందింది ఈ పాట.
ఫిబ్రవరి లో 7న విడుదల కాబోతోంది జాను సినిమా. ఇక్కడ ప్రస్తుతమో, అప్రస్తుతమో కానీ, లవర్స్ డే కి విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' కాస్త అటుగా బ్యాచులర్ ఫర్ ఎవర్ అంటూ నితిన్ 'భీష్మ' కూడా ఈ జాను సినిమాతో పాటే విడుదలవుతున్నాయి. అంటే ఫిబ్రవరి నెల సినిమా ప్రేక్షకులకు ప్రేమ సినిమాల వల అన్నమాట.