జ‌గ‌న్‌తో నాగార్జున‌ భేటీ వెన‌క‌…

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, మ‌న్మ‌థుడు నాగార్జున చాలా స‌న్నిహితులు. రాజ‌కీయంగా ఇద్ద‌రూ ఒకే మాట‌… ఒకే బాట అన్న‌ట్టు న‌డుచుకుంటుంటారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం జ‌గ‌న్‌తోనూ చిరంజీవి, నాగార్జున ఇద్ద‌రూ క‌లిసి…

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, మ‌న్మ‌థుడు నాగార్జున చాలా స‌న్నిహితులు. రాజ‌కీయంగా ఇద్ద‌రూ ఒకే మాట‌… ఒకే బాట అన్న‌ట్టు న‌డుచుకుంటుంటారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ సీఎం జ‌గ‌న్‌తోనూ చిరంజీవి, నాగార్జున ఇద్ద‌రూ క‌లిసి భేటీ అయిన సంద‌ర్భాలు అనేకం. త‌మ‌తో పాటు టాలీవుడ్‌లోని ఇత‌ర ప్ర‌ముఖుల‌ను కూడా వీరు వెంట‌బెట్టుకెళ్ల‌డం చూశాం.

తాజాగా చిరంజీవి లేకుండానే సీఎం జ‌గ‌న్‌తో నాగార్జున భేటీ కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌గ‌న్‌ను నాగార్జున‌తో పాటు నిర్మాత‌లు ప్రీతంరెడ్డి, నిరంజ‌న్‌రెడ్డి స‌హా మ‌రికొంద‌రు భేటీ అయిన‌ట్టు స‌మాచారం. సీఎంతో క‌లిసి వాళ్లంతా మ‌ధ్యాహ్నం భోజ‌నం కూడా చేసిన‌ట్టు తెలుస్తోంది.

సినీరంగానికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్‌తో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. అయితే ఉరుము మెరుపు లేకుండా సీఎంతో నాగార్జున‌, ఇత‌ర సినీ సెల‌బ్రిటీలు భేటీ కావ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇటీవ‌ల సినిమా టికెట్ల‌ను ప్ర‌భుత్వ‌మే ఆన్‌లైన్‌లో అమ్మాల‌నే నిర్ణ‌యం వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే. 

ప్ర‌భుత్వ వైఖ‌రిని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకించారు. కానీ ఈ విష‌యంలో ప‌వ‌న్ ఒంట‌ర‌య్యారు. త‌మ విజ్ఞ‌ప్తి మేర‌కే ప్ర‌భుత్వం ఆన్‌లైన్ విక్ర‌యంపై సానుకూలంగా స్పందించింద‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్‌తో నాగార్జున‌తో పాటు నిర్మాత‌ల భేటీ వెనుక ఎజెండా ఏమిట‌నేది ఇంకా తెలియ‌డం లేదు.