హుజూరాబాద్‌లో దళిత బంధు పథకం నిలిపివేతను అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేం అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లను హైకోర్టు రద్దు చేయడం గమనార్హం.
ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా నేపథ్యంలో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ప్రచారం కూడా పూర్తయి మరో 48 గంటల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఈ పథకం కింది దళితులకు భారీగా లబ్ధి చేకూర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార పార్టీ పథకాల పేరుతో ప్రలోభాలకు గురి చేస్తోందని ప్రత్యర్థులు విమర్శలకు పదును పెట్టారు. కొన్ని రాజకీయ పక్షాల ఫిర్యాదుతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుఏంది. ఉప ఎన్నిక ముగిసే వరకూ హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని నిలిపివేయాలని ఈ నెల 18న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.
ఈసీ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత జడ్సన్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖరరెడ్డిల ధర్మాసనం విచారించింది.
ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. నిష్పక్షపాత ఎన్నికలకు నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి ఉందని పేర్కొంది. ఈ మేరకు మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్ పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది.