ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాత్సల్యానికి మెగాస్టార్ చిరంజీవి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇటీవల కాలంలో చిరంజీవిలో ఇంత సంతోషాన్ని ఎప్పుడూ చూడలేదని అభిమానులు అంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్ల ధరల నియంత్రణ, అలాగే ఇతరత్రా అంశాలపై తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాలతో చిత్రపరిశ్రమ మనుగడ సాగించలేదనే ఆందోళన టాలీవుడ్‌లో నెలకుంది. తమ విన్నపాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో లంచ్ భేటీకి మెగాస్టార్ చిరంజీవిని సీఎం ఆహ్వానించారు. సీఎం ఆహ్వానాన్ని మన్నించి చిరంజీవి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన చిరంజీవిని స్వయంగా జగన్ ఆహ్వానించి, ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్లారు. లంచ్ చేస్తూ సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చించారు. లంచ్ భేటీ వివరాలను చిరంజీవి విమానాశ్రయం వెలుపల వివరించారు.
ఈ సందర్భంగా జగన్ ఆతిథ్యానికి చిరంజీవి ఫిదా అయినట్టు ఆయన బాడీ లాంగ్వేజ్ చెప్పింది. జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి దగ్గరుండి మరీ వడ్డించడాన్ని ప్రస్తావిస్తూ…తన్మయత్వం చెందారు. జగన్‌తో లంచ్ భేటీ ఎంతో అద్భుతంగా సాగిం దని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి మాటల్లో జగన్‌పై ఆప్యాయత, అనురాగాలు ప్రతిబింబించాయి. ఆయన ఏమన్నారంటే…
‘పండగ పూట విందుకు పిలిచి ఆప్యాయంగా మాట్లాడారు. అలాగే జగన్ సతీమణి భారతి దగ్గరుండి వడ్డించడం చాలా ఆనందంగా ఉంది. తిరిగి అపాయింట్‌మెంట్ ఎప్పుడు అని అడగ్గా.. ‘ఎప్పుడంటే అప్పుడు భోజనానికి వచ్చేయండన్నా’ అని జగన్ అన్నారు. జగన్ ఆహ్వానం మేరకే ఆయనతో భేటీ అయ్యానని, ఆ భేటీ సంతృప్తికరంగా జరిగింది. జగన్ నాకు సోదర సమానుడు. సీఎం దంపతుల ఆతిథ్యం ఎంతో బాగుంది’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. తనకు తమ్ముడితో సమానమని జగన్‌ను ఉద్దేశించి చిరంజీవి అనడం విశేషం.
ఇంతకంటే జగన్‌పై అభిమానాన్ని చాటుకోడానికి మాటలేముంటాయ్? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతికి ఆత్మీయుల ఇంటికి వెళ్లిన అనుభూతిని చిరంజీవి మాటల్లో కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారానికి జగన్ సానుకూల స్పందన తనకెంతో ధైర్యాన్ని ఇచ్చిందని చిరంజీవి చెప్పడం ద్వారా…టాలీవుడ్‌కి తీపి కబురు చెప్పారని భావించొచ్చు.